Saturday, November 23, 2024

గొర్రెల పెంపకందారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Sheep breeders developed in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణలో గొల్ల కురుమల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 75శాతం సబ్సిడితో గొరెల యూనిట్లు పంపిణీచేస్తూ గొర్రెల పెంపకం దారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. గురువారం రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూదిమెట్ట బాలరాజ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం చొరవతో యాదవులు రాజకీయంగా ఎంతో అభివృద్ది సాధించారన్నారు.

ఆర్ధికంగా , సామాజికంగా అభివృద్ధి చెందాలనే దృఢసంకల్పంతో సబ్సిడిపై గొర్రెల పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. గతంలో పాలకులు వీరిని కేవలం ఓటుబ్యాంకుగానే చూశారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న వారికి సేవ చేసే అవకాశం బాలరాజ్ యాదవ్‌కు కల్పించారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమం , అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమ కారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందన్నారు.

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. సిఎం కెసిఆర్ కృషితో యాదాద్రి దేవాలయం ఒక అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకున్నదని తెలిపారు. యాదవుల కులదైదం కొమురవెళ్లి మల్లన్న ఆలయం కూడా గతంలో కంటే ఎంతో అభివృద్ది చెందిందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కలను నెరవేర్చేలా పనిచేయాలని సూచిస్తూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన బాలరాజ్ యాదవ్‌ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ అభినందించి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్ , జైపాల్ యాదవ్ ,పశుసంవదర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గొర్రెలు మేకల లభివృద్ధి ఫెడరేషన్ ఎండి రాంచందర్ , మత్స శాఖ కమీషనర్ లచ్చిరాం భూక్యా, బ్రేవరేజెస్ ,వేర్‌హౌసింగ్ కార్పేరోషన్ల చైర్మన్లు గజ్జెల నగేష్ , సాయిచంద్ , నల్లగొండ డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి , ఎస్సి కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘాల నాయకులు , యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News