హైదరాబాద్ : తాము రూపొందించిన కొవాగ్జిన్ టీకా కొవిడ్ 19 వైరస్‌ను నిర్వీర్యం చేయడమే కాకుండా ఇమ్యునిటీని కూడా పెంపొందిస్తుందని టీకా క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైందని భారత్ బయోటెక్ సంస్థ గురువారం ప్రకటించింది. కొవాగ్జిన్ రెండు, మూడు ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. 218 ఏళ్ల లోపు పిల్లల కోసం రూపొందించిన ఈ టీకా ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలను కనబర్చిందని వివరించింది. కొవాగ్జిన్ తీసుకున్న చిన్నారుల్లో 1.7 రెట్లు యాంటీబాడీలు వృద్ధి చెందాయని, ముఖ్యంగా తీవ్ర దుష్పరిణామాలేవీ కనిపించలేదని స్పష్టం చేసింది. పిల్లలకు ఈ టీకా సురక్షితమే కాక తట్టుకోగల శక్తి, రోగనిరోధకత పెరుగుతున్న విషయం ప్రయోగాల్లో రుజువైందని పేర్కొంది. పెద్దవారితోపాటు చిన్నారులకు కూడా సురక్షిత, సమర్ధమైన టీకాను అభివృద్ధి చేసే లక్షాన్ని సాధించామని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.
చిన్నారులకు టీకా తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ప్రయోగాలను పిల్లలపై నిర్వహించింది. మొత్తం 525 మంది వాలంటీర్లను నమోదు చేసుకుని వారిని మూడు విభాగాలుగా విభజించి ప్రయోగాలు జరిపింది. మొత్తం వాలంటీర్లలో 374 మందిలో స్వల్ప దుష్ప్రభావాలు మాత్రమే కనిపించాయి. వారిలో 78 శాతం మందిలో అవి ఒక రోజు లోపే తగ్గి పోయాయి. వారందరి లోనూ ఇంజక్షన్ ఇచ్చిన చోట సాధారణ నొప్పి కనిపించిందని, భారత్ బయోటెక్ వెల్లడించింది. అక్టోబర్ లోనే ఈ ప్రయోగ ఫలితాలను కేంద్ర ఔషధ ప్రమాదాల నియంత్రణ సంస్థ కు భారత్ బయోటెక్ అందజేసింది. వాటిని సబ్జెక్ట్ నిపుణుల కమిటీ విశ్లేషించి అత్యవసర వినియోగానికి సిఫార్సు చేసింది. అనంతరం 12 18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవలే అనుమతి ఇచ్చింది. వీటి తుది దశ ప్రయోగాల ఫలితాలను తాజాగా విడుదల చేసింది.