2021 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
‘వల్లంకితాళం’ కవితాసంపుటికి దక్కిన అపూర్వ గౌరవం
దేవరాజు మహారాజు (నేనంటే ఎవరు నాటకం)కు బాలసాహిత్య పురస్కారం
తగుళ్ల గోపాల్ (దండకడియం కవితాసంపుటి)కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం
ముగ్గురు తెలంగాణ సాహితీ కుసుమాలకు అవార్డుల పంట
తెలంగాణ మట్టివాసనలను విశ్వవ్యాప్తం చేసిన గోరటి
వెంకన్న సాహిత్యం మానవుల వేదనకు అద్దం పడుతోంది : ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం
దేవరాజు, తగుళ్లకు శుభాకాంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడు, జానపద గాయకుడు, ఎంఎల్‌సి గోరేటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించింది. 2021 ఏడాదికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆయనకు దక్కింది. ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి ఈ పురస్కారం వచ్చింది. మానవీయ సంస్కృతీ, స్వచ్ఛమైన ప్రకృతి మేళవింపుగా ‘వల్లంకి తాళం’ కవిత సంపుటిని గోరటి తీర్చిదిద్దారు. గోరటి వెంకన్న తన కవిత్వంలో ప్రజల జీవితాలను కళ్లకు కట్టారు. జనం కష్ట సుఖాలను, వెతలను, హింసకు గురవుతున్న విధానాలను ఎలుగెత్తిచాటారు. ‘వల్లంకి తాళం’ కవితసంపుటిలోనూ గోరటి తన మార్కు చూపించారు. తగుళ్ల గోపాల్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. దండకడియం కవితాసంపుటికి ఈ పురస్కారం దక్కింది. ‘నేను అంటే ఎవరు’ నాటకానికి దేవరాజు మహారాజుకు బాలసాహిత్య పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను మొత్తం 20 భాషలకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్టు సాహిత్య అకాడమీ పేర్కొంది.
గుజరాత్, మణిపురి, మైతిలి, ఉర్ధూ, భాషలకు సంబంధించి అవార్డులను తరువాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. త్వరలో నిర్వహించబోయే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పురస్కారాన్ని, నగదు బహుమతిని అకాడమీ అందచేయనుంది. తెలుగు భాషకు సంబంధించి డాక్టర్ సి.మృణాళిని, మనతెలంగాణ ఎడిటోరియల్ అడ్వైజర్ జి.శ్రీరామమూర్తి, డాక్టర్ కాత్యాయని విద్మహేలు జ్యూరీ సభ్యులుగా వ్యవహారించారు. గతంలో గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అంటూ ప్రపంచీకరణ వల్ల జరిగిన నష్టాన్ని హృదయాలను తాకేలా వివరించగా, ‘గల్లీ సిన్నది పాటలో’ బస్తీ బతుకులను ఆయన ఆవిష్కరించారు. వీటితోపాటు ‘పల్లెపల్లెన పల్లేర్లు మొలిసే పాటలో’ దుర్భర స్థితిలో ఉన్న తెలంగాణ పల్లె కష్టాలను కళ్లకు కట్టినట్టుగా వివరించారు. గోరటి పాటలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించాయి. కేంద్ర సాహిత్య పురస్కారం రావడంపై గోరటి వెంకన్న సంతోషం వ్యక్తంచేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారంలో….
నాగర్‌కర్నూల్ జిల్లా గౌరారంలో గోరటి వెంకన్న 1963లో జన్మించారు. ‘వల్లంకి తాళం’తో పాటు అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి తదితర పుస్తకాలను ఆయన రచించారు.
ప్రశంసా పత్రంతో పాటు లక్ష రూపాయలు
ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసాపత్రంతో పాటు లక్ష రూపాయలు నగదును అందజేస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి ఏటా 20 భారతీయ భాషల్లో ప్రాచుర్యం పొందిన సాహిత్యానికి అవార్డులు ప్రకటించడం ఆనావాయితీగా వస్తోంది. 2016లో తెలంగాణ ప్రభుత్వం వెంకన్నకు కాళోజీ పురస్కారం అందించగా 2006లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును ప్రదానం చేసింది. అంతేకాకుండా తెలంగాణ పాటను విశ్వవ్యాప్తం చేసిన గోరేటి వెంకన్నకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019లో ‘కబీర్ సమ్మాన్’ పురస్కారం ప్రదానం చేసింది. ఇప్పటికే వెంకన్న పాటలు తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రజాదరణ పొందాయి.