రూ.10వేల కోట్ల విలువైన భూములపై హైకోర్టు కీలక తీర్పు
గ్రేహౌండ్స్‌కు కేటాయించిన 142 ఎకరాలపై
45మంది పిటిషన్లను తిరస్కరిస్తూ సిజె
నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవులలో పోలీసుశాఖకు కేటాయించిన రూ. 10 వేల కోట్ల వివాదస్పద భూమిపై శుక్రవారం నాడు హైకోర్టు తీర్పును వెలువరించింది. గ్రేహౌండ్స్‌కు కేటాయించిన సర్వే నంబర్ 391/1 నుంచి 391/20లోని 142 ఎకరాలు ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. మంచిరేవులలోని 142 ఎకరాల భూమి విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని రెవెన్యూశాఖ వెల్లడించింది. 2007లో గ్రేహౌండ్స్‌కు ప్రభుత్వం 142 ఎకరాల భూమిని కేటాయించగా ఆ భూమి తమదేనంటూ 45మంది ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో 2010లో పిటిషనర్లకు పరిహారం చెల్లించి భూసేకరణ చేయాలని సింగిల్ జడ్జి తీర్పును వెలువరించారు.
సింగిల్ జడ్జి తీర్పును 2010లో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ప్రభుత్వ అప్పీళ్లపై హైకోర్టు సిజె ధర్మాసనం తీర్పును వెలువరించింది. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా డిజిపి, గ్రేహౌండ్స్ అడిషనల్ డిజి, అడ్వకేట్ జనరల్, రంగారెడ్డి కలెక్టర్, ఆర్‌డివొ, గండిపేట ఎంఆర్‌వొ విశేషంగా కృషి చేశారని ఈ సందర్భంగా హైకోర్టు ఛీఫ్ జస్టీస్ పేర్కొన్నారు. మంచిరేవుల భూములను కబ్జా చేసి వెంచర్లు వేసిన రియల్టర్లు, కబ్జాదారులపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేశారు.