న్యూఢిల్లీ: వెంటనే 356 మంది జాలరులు, ఇద్దరు పౌరులను విడుదల చేసి భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం శనివారం కోరింది. ఇప్పటికే ఈ బందీల జాతీయతను ధ్రువీకరించి పాకిస్తాన్ అధికారులకు తెలియచేయడం జరిగిందని భారత్ తెలిపింది. వీరేగాక పాకిస్తాన్ అదుపులో ఉన్న మరో 182 మంది భారతీయ జాలరులు, 17 మంది పౌర ఖైదీల విడుదలకు కూడా చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. 2008లో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది జనవరి 1, జులై 1న భారత్, పాక్ తమ అదుపులో ఉన్న జాలరులు, పౌర ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకోవడం ఆనవాయితీ. భారత్ అదుపులో ఉన్న పాకిస్తాన్‌కు చెందిన 282 పౌర ఖైదీఉ, 73 జాలరుల జాబితాను భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అందచేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. అదే విధంగా పాకిస్తాన్ కూడా తమ అదుపులో ఉన్న 51 మంది పౌర ఖైదీలు, 571 మంది జాలరుల జాబితాను అందచేసింది.