మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జీ జనరల్ మేనేజర్‌గా నైరుతి రైల్వే (ఎస్‌డబ్ల్యుఆర్) జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన జమల్‌పూర్‌లోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఐఆర్‌ఐఎమ్‌ఈఈ) పూర్వ విద్యార్థి. సంజీవ్ కిషోర్ గుర్గావ్‌లోని ఎమ్‌డిఐ నుంచి (ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రధానమంత్రి పతకం అందుకున్నారు) పిజి డిప్లమా పొందారు. గుర్గావ్ ఎమ్‌డిఐ నుంచి స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఫెలో ప్రోగ్రాం (డాక్టోరల్ లెవల్) పూర్తి చేశారు. ఆయన భారత రైల్వేలో ఈశాన్య రైల్వేలో, కపుర్తల రైల్ కోచ్ ఫ్యాక్టరీలో, మధ్య రైల్వేలో, ఆర్‌ఐటిఈఎస్, సిఓఎఫ్‌ఎమ్‌ఓడబ్ల్యు, న్యూ ఢిల్లీలోని రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కేంద్రంలో, రైల్వే బోర్డులో బెంగళూరు ఎలహంకలోని రైల్ వీల్ ఫ్యాక్టరీలలో వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించారు. ఆయన అమెరికాలోని కార్నెజిక్ మెలన్ యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్ స్ట్రాటెజిక్ మేనేజ్‌మెంట్‌లో, ఇటలీలోని ఎస్‌డిఏ బోక్కోనిలో ఎగ్జిక్యూటిక్ లీడర్‌షిప్‌లో శిక్షణ పొందడంతో పాటు అనేక పరిశోధన పత్రాలు సమర్పించారు.
ఆయన కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో సామర్ధ్య అభివృద్ధి కోసం యూఎన్‌డిపి ప్రాజెక్టును (1998), జర్మనీ, ఫియట్, ఇటలీ మరియు స్విట్జార్లాండ్‌ల నుంచి ఎల్‌హెచ్‌బి సాంకేతిక మార్పిడి రంగంలో, అమెరికాలోని ప్రముఖ సంస్థల భాగస్వామ్యం కలిగి ఉన్న ఆర్‌ఐటిఈఎస్‌లో క్రాష్‌వర్తి కోచ్ డిజైన్ (2003 నుంచి 2009)లలో వివిధ అంశాల నిర్వహణలో విశేష అనుభవాన్ని కలిగి ఉన్నారు. భారత దేశంలోని అనేక ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో ఆయన పనిచేశారు. భారత్ నుంచి (బెంగళూరులోని యెలహంక వద్ద రైల్ వీల్ ఫ్యాక్టరీ) మొజాంబిక్‌కు రైల్ వీల్ , యాక్సెల్ సెట్స్ ఎగుమతి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2003లో జాతీయ అవార్డు (రైల్వే మంత్రిత్వ శాఖ అవార్డు) ఆయనకు లభించింది. ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఇంజనీర్ ఇండియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇనిస్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ సంస్థల నుంచి ఆయన ఫెలోషిప్‌ను అందుకున్నారు.