న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: మూడు దశాబ్దాల సంప్రదాయానికి కొనసాగింపుగా శనివారం భారత్, పాకిస్థాన్ తమ దేశాల్లోని అణుస్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణుస్థావరాలపై మరొకరు దాడులు చేసుకోకుండా భారత్,పాక్ 1988, డిసెంబర్ 31న ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ ఒప్పందానికి అనుగుణంగా 1992,జనవరి 1నుంచి ప్రతిఏటా తమ దేశాల్లోని అణుస్థావరాల జాబితాను దౌత్య కార్యాలయాల ద్వారా ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఇలా జాబితాలను ఇరు దేశాలు ఇచ్చుకోవడం ఇది 31వసారి. పాకిస్థాన్ తమ జాబితాను ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో శనివారం ఉదయం 1030కి ఇవ్వగా, ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో భారత్ తన జాబితాను ఉదయం 11 గంటలకు ఇచ్చింది.
ఖైదీల జాబితాలు కూడా..
ఇరు దేశాలు తమ జైళ్లలోని దాయాది ఖైదీల జాబితాను కూడా ఇచ్చిపుచ్చుకున్నాయి. పాక్ జైళ్లలో మొత్తం 628 మంది భారత ఖైదీలున్నారు. వారిలో 577మంది మత్సకారులు కాగా, 51మంది సాధారణ పౌరులు. భారత్ జైళ్లలో మొత్తం 355 మంది పాక్ ఖైదీలున్నారు. వారిలో 73మంది మత్సకారులు కాగా, 282మంది సాధారణ పౌరులు. ఖైదీల జాబితాను ఏటా రెండుసార్లు (జనవరి1,జులై 1న) ఇచ్చిపుచ్చుకునే ఒప్పందంపై 2008, మే 21న ఇరు దేశాలు సంతకాలు చేశాయి.