స్యూఢిల్లీ: నూతన సంవత్సరం సందర్భంగా శనివారం భారత్,చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇరు దేశాల మధ్య వాస్తవాధీనరేఖ(ఎల్‌ఎసి)లోని ఈశాన్య లడఖ్ ప్రాంతంలోని పది సరిహద్దు పాయింట్ల వద్ద ఇరు సైన్యాలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాయి. ఈశాన్యలడఖ్‌లో 18 నెలలుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి సుహృద్భావ సంఘటన ఇరు సైన్యాలకు ఇదే మొదటిది. ఈశాన్యలడఖ్‌లో మిఠాయిలు పంచుకున్న పాయింట్లలో కొంకలా, చుషుల్ మోల్డో, డెమ్‌చోక్ హాట్ స్ప్రింగ్స్, దౌలత్‌బేగ్ ఓల్డీ, బాటిల్‌నెక్, కెకె పాస్, అరుణాచల్ సెక్టార్‌లోని బమ్లా, వాచాదమల్ ఉన్నాయని అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ సరిహద్దులోని చిలేహానా తిత్వాల్ క్రాసింగ్ పాయింట్ వద్ద పాక్ సైనికులతోనూ భారత సేనలు మిఠాయిలు పంచుకున్నాయి. ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం కోసం ఏటా ఇలా మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని భారత అధికారి ఒకరు తెలిపారు.