Sunday, January 19, 2025

‘ఆర్‌ఆర్‌ఆర్ పూర్తయితే’ హైదరాబాద్‌కు సాటేది?

- Advertisement -
- Advertisement -

ShaikPet Flyover Inaugurated by Minister KTR

రక్షణశాఖ భూముల అప్పగింతలో యుపికో నీతి, తెలంగాణకు మరో నీతా?

కంటోన్మెంట్‌లో మూసివేసిన రోడ్లను వెంటనే తెరిపించండి
స్కైవేల నిర్మాణానికి అడ్డంకులు తొలగించండి
హైదరాబాద్‌కు అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కెటిఆర్ వినతి
కిషన్‌రెడ్డితో కలిసి షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
కేంద్రం తరఫున సహకారం అందిస్తాం : కిషన్‌రెడ్డి

ఇవి రాష్ట్రం నిధులే, కేంద్రానివని చెప్పుకోవద్దు

కేందమంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి కెటిఆర్ సరదా కామెంట్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో రక్షణ శాఖ భూములను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన కేంద్రం తెలంగాణకు మాత్రం ఎందుకు అప్పగించడం లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి ఖాళీగా ఉన్న రక్షణ శాఖ భూములను ఇవ్వాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర పర్యాటక శాఖ కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రక్షణ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేలా చూడాలన్నారు. భూములు ఇస్తే రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామని ఈ సందర్భంగా కెటిఆర్ హామీ ఇచ్చారు.

ఎస్‌ఆర్‌డిపి (సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రణాళిక) కార్యక్రమం సిఎం కెసిఆర్ మానస పుత్రికగా మంత్రి కెటిఆర్ అభివర్ణించారు. అందుకే ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఆరు వేల కోట్లకుపైగా నిధులను వెచ్చిస్తోందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ పూర్తయితే దేశంలో ఏ నగరం కూడా హైదరాబాద్‌కు పోటీ రాదన్నారు. నూతన సంవత్సరం కానుకగా శనివారం నగరంలోని టోలిచౌకి నుంచి ఖాజాగుడా వరకు సుమారు రూ.335 కోట్లతో 2.8కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లతో షేక్‌పేట్‌లో నిర్మించిన పై వంతెనను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, తీసుకుంటున్నదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో కేవలం ఏడేళ్లలోనే రాష్ట్రం అద్భుతమైన విజయాలను సాధిస్తోందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం విధిగా చేయూత నివ్వాలని మంత్రి కెటిఆర్ సూచించారు.

రాష్ట్ర విభజన కారణంగా ఎన్నో సమస్యలను అధిగమించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో కొంత పుంతలు తొక్కుతోందన్నారు. అందువల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి తగు సహకారం లభించేలా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తగు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర సహకారం లభిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు 4వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని గుర్తుచేశారు.

కంటోన్మెంట్ రోడ్లను వెంటనే తెరవాలి

కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ శాఖ అధికారులు మూసివేసిన పలు రోడ్లను వెంటనే తెరిపించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మంత్రి కెటిఆర్ కోరారు. రోడ్లు మూసివేత స్థానికులకు ఇబ్బందిగా మారిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్కైవేల నిర్మాణానికి కేంద్రం సహకరించే విధంగా చూడాలన్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా భూములు ఇవ్వలేదని కేంద్ర మంత్రి సమక్షంలోనే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయన్నారు. వాటికి కేంద్రం సహకారం అందిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశముంటుందన్నారు. ఈ విషయంలో కిషన్‌రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

తీరనున్న ట్రాఫిక్ కష్టాలు

కొత్త ఏడాదిలో పాత, కొత్త నగరాలను కలిపే ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్లైఓవర్ ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టా లు తీర్చడంలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఏడున్నారేళ్లుగా ఎస్‌ఆర్‌డిపి ప్రాజెక్టు కింద హైదరాబాద్ మహానగరంలో 24 కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామన్నామని ఆయన వెల్లడించారు. ఇంకా చేయాల్సింది ఉందన్నారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రధానంగా నాలు గు ప్రధాన జంక్షన్లను కవర్ చేయనుందన్నారు. ప్రధానంగా షేక్‌పేట్, ఫిలింనగర్, ఒయు కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్‌లు దాటి నేరుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిందని వివరించారు.

కిషన్‌రెడ్డిపై సరదా కామెంట్లు చేసిన కెటిఆర్

షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను చూపిస్తూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై సరదా…సరదాగా కామెంట్లు చేశారు. తనదైన శైలిలో సైటెర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హంగులతో… ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ఫ్లెఓవర్ నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చిందన్నారు. మళ్లీ దీనికి కూడా కేంద్రం నిధులు ఇచ్చినట్లు ప్రకటన చేయవొద్దు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఉన్న వారంతా పగలబడి నవ్వుకున్నారు. దీంతో ఈ కార్యక్రమం పూర్తిగా సాఫీగా…ఆహ్లాదకరంగా ముగిసింది.

సహకారం అందిస్తాం

అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందన్నారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదన్నారు. అభివృద్ధిలో తమకు అన్ని రాష్ట్రాలు సమానమేనని అన్నారు. ఏ రాష్ట్రంపై ఈర్ష లేదన్నారు. పైగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మరింత ప్రొత్సాహం ఇవ్వడంలో మోడీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. సభలో మంత్రి కెటిఆర్ చేసిన పలు విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు మహమ్మూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీతో పాటు మజ్లిస్ పార్టీ నేతలు. పలువురు మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News