రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు కమిటీ నిర్ధారణ?
వచ్చే వారం వాయుసేన చీఫ్‌కు నివేదిక
న్యూఢిల్లీ: తమిళనాడులోని కూనూరు వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ( సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వాయుసేన, ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ ఈ నివేదికను త్వరలోనే వాయుసేన చీఫ్‌కు సమర్పించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలనుటంకిస్తూ జాతీయ మీడియా ఆదివారం తెలిపింది. జనరల్ రావత్, ఆయన సతీమణి మధులిక ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ గత డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూరు వద్ద కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ జరుగుతోంది.
ఈ ప్రమాదానికి కారణం వాతావరణం ప్రతికూలంగా ఉండడమేనని దర్యాప్తులో వెల్లడయినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. దారి కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, సాంకేతిక లోపం వంటివి కారణం కాదని తెలిసిందని పేర్కొంది. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో పైలట్ గందరగోళానికి గురయి ఉండవచ్చని,ప్రమాదవశాత్తు భూమిపైకి వచ్చి ఉండవచ్చని దర్యాప్తు బృందం భావించినట్లు పేర్కొంది.ఈ దర్యాప్తు నివేదికను తయారు చేయడానికి వాయుసేన న్యాయ విభాగం సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే తుది నివేదికను ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరికి సమర్పించనున్నట్లు తెలిసింది.