మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు శాంతిభద్రతలు, ఉత్తమ సేవలు అందించడంలో ఎపి డిజిపి డి.గౌతమ్ సవాంగ్ దేశంలోనే అత్యుత్తమ డిజిపిగా నిలిచారని ది బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది. 2021లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల జాబితాను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది. ఎపిలో గడిచిన రెండేళ్లలో కోవిడ్ వల్ల అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని, అటువంటి క్లిష్ట సమయంలోనూ డిజిపి సవాంగ్ ప్రజలకు విశేష సేవలు అందించారని ది బెటర్ ఇండియా సంస్థ కితాబిచ్చింది. దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ (ఆప్షన్) ద్వారా అనేక మంది బాధితులకు సత్వర రక్షణ కల్పించేలా డిజిపి చొరవ చూపినట్లు పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని బాధితుల ఫిర్యాదులు, వేగవంతమైన దర్యాప్తులో ఎంతో సమయాన్ని ఆదా చేశారని సంస్థ వివరించింది. సాంకేతికను ఉపయోగించుకుని 85 శాతం కేసుల పరిష్కారానికి దోహదపడ్డారని, ఎస్‌వొఎస్ బటన్ ఆప్షన్ ద్వారా ఐదు నెలల్లోనే 2,64,000 డౌన్‌లోడ్‌లతో రికార్డు సృష్టించారని ది బెటర్ ఇండియా సంస్థ తెలిపింది. మహిళల కోసం ప్రారంభించిన దిశా మొబైల్ యాప్ కేవలం ఐదు నెలల్లోనే 12.57 లక్షల డౌన్‌లోడ్‌లను చేయడంతో అద్భుతాలు సాధించారని ది బెటర్ ఇండియా సంస్థ డిజిపి గౌతమ్ సవాంగ్ సేవలను ప్రశంసించింది.