సిరీస్‌పై భారత్ కన్ను, సౌతాఫ్రికాకు పరీక్ష, నేటి నుంచి రెండో టెస్టు
జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికాతో సోమవారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. దీంతో వాండరర్స్ వేదికగా జరిగే మ్యాచ్‌లో టీమిండియా మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇక ఈ మ్యాచ్ సౌతాఫ్రికా సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన ఒత్తిడి ఆతిథ్య జట్టుపై నెలకొంది. కీలక ఆటగాళ్లు ఫామ్ లేమీతో బాధపడుతున్నారు. అంతేగాక స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం కూడా సౌతాఫ్రికాకు మరింత ప్రతికూలంగా మారింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా అసాధారణ పోరాట పటిమతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. జోరుమీదున్న భారత్‌ను ఓడించాలంటే సౌతాఫ్రికా సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. కానీ బుమ్రా, షమి, సిరాజ్, అశ్విన్, శార్దూల్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఇలాంటి స్థితిలో వీరిని ఎదుర్కొని భారీ స్కోర్లు సాధించడం సఫారీ బ్యాటర్లకు అంత తేలికకాదనే చెప్పాలి.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డీన్ ఎల్గర్ బాగానే ఆడాడు. ఇక బవుమా కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. కానీ మార్‌క్రామ్, పీటర్సన్, డుసెన్, మహారాజ్ తదితరులు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేక పోయారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ ఎల్గర్ కూడా జట్టును ముందుండి నడిపించక తప్పదు. బౌలర్లు కూడా మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి. అప్పుడే టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్‌లో ఓడితే మాత్రం సౌతాఫ్రికా సిరీస్‌ను కోల్పోక తప్పదు. బౌలర్లు బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యం సఫారీలకు ప్రతికూలంగా మారింది. రెండో టెస్టులో ఈ లోపాన్ని సరిదిద్దూ కోకుంటే మరో ఓటమి ఎదురైనా ఆశ్చర్యం లేదు.
జోరుమీదుంది..
మరోవైపు సెంచూరియన్ టెస్టు విజయం భారత్‌లో కొత్త జోష్‌ను నింపింది. ఈ మ్యాచ్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యేందుకు ఇది దోహదం చేసింది. అయితే కీలక ఆటగాళ్లు పుజారా, కోహ్లి, రహానె వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. తొలి టెస్టులో పుజారా రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. ఈసారైనా అతను మెరుగైన ప్రదర్శన చేస్తాడా లేదా అనేది సందేహంగా మారింది. ఇక పుజారాను తప్పించి శ్రేయస్ లేదా విహారిలలో ఒకరికీ తుది జట్టులో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక రహానె, కోహ్లిలు కూడా మెరుగైన బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక తొలి టెస్టులో సెంచరీతో రాణించిన వైస్ కెప్టెన్ రాహులపై జట్టు ఈసారి కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పాలి.రిషబ్ పంత్, అశ్విన్‌లు కూడా మెరుగైన బ్యాటింగ్ చేయాలి. బౌలర్లు తొలి టెస్టు మాదిరిగానే రాణించాలి. ఇదే జరిగితే సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ కలను సాకారం చేసుకోవడం టీమిండియాకు అసాధ్యమేమీ కాదు.