న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్‌లో దేశంలో నిరుద్యోగిత నాలుగు నెలల గరిష్ఠానికి చేరిందని మేధోమథన సంస్థ భారత ఆర్థిక పర్యవేక్షణా కేంద్రం(సిఎంఐఇ) నివేదిక వెల్లడించింది. నవంబర్‌లో 7 శాతంగా ఉన్న నిరుద్యోగిత, డిసెంబర్‌లో 7.9 శాతానికి ఎగబాకిందని నివేదిక తెలిపింది. డిసెంబర్‌లో పట్టణ నిరుద్యోగిత 9.3 శాతంగా, గ్రామీణ నిరుద్యోగిత 7.3 శాతంగా నమోదైంది. నవంబర్‌లో ఇవి వరుసగా 8.2 శాతం, 6.4 శాతంగా నమోదయ్యాయి. గత ఆగస్టులో దేశ నిరుద్యోగిత 8.3 శాతంగా నమోదైంది. ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడుతుండగా, ఒమిక్రాన్ రాకతో మరోసారి ఆర్థిక వ్యవస్థ తిరోగమనంవైపు మళ్లిందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఒమిక్రాన్ ఉధృతి వల్ల పలు రాష్ట్రాలు ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడం వల్ల వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నదని విశ్లేషకులు అంటున్నారు. దీంతో, గడిచిన త్రైమాసికం ఫలితాలు నిరాశకలిగించేలా ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు. నెలవారీగా దేశ నిరుద్యోగితపై ప్రభుత్వం లెక్కలు ఇవ్వకపోవడం వల్ల సిఎంఐఇ నివేదికల్ని ఆర్థికవేత్తలు, విధానకర్తలు నిశితంగా గమనిస్తున్నారు.
డిసెంబర్‌లో 7.9 శాతానికి చేరిన నిరుద్యోగిత, 4 నెలల గరిష్ఠం: సిఎంఐఇ
- Advertisement -
- Advertisement -
- Advertisement -