మనతెలంగాణ/హైదరాబాద్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని స్తంభంపల్లిలో ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఈ కంపెనీ ఏర్పాటు విషయమై మంగళవారం ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, క్రిబ్ కో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి రాంరెడ్డిలతో మంత్రి కెటిఆర్ సవివరంగా చర్చించారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని తెలిపారు.
కంపెనీ ఏర్పాటుకు నియోజకవర్గం స్తంభంపల్లి సైట్‌లోని చిన్నపాటి గుట్ట పరిసరాలను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ(టిఎస్‌ఐఐసి) ద్వారా చదును చేయించాలని సంస్థ ఎండి వెంకట నర్సింహారెడ్డిని మంత్రి ఆదేశించారు. భూ సేకరణకు సంబంధించి సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని కెటిఆర్ అధికారులకు ఆదేశాలించారు. మంత్రి కెటిఆర్ సానుకూల స్పందన పట్ల మంత్రి కొప్పుల, ఎంపి వెంకటేష్, చైర్మన్ దామోదర్‌గుప్తా సంతోషం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ధర్మపురిలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతులకు, ప్రజలందరూ ఇందుకు నెలకొన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారని వారు వెల్లడించారు.
Ethanol Company set up in Dharmapuri: KTR