కారు ఆపి మాస్కు తొడిగిన సిఎం
చైన్నై రోడ్లపై మాస్కులు పంపిణీ చేసిన స్టాలిన్
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని విజ్ఞప్తి
చెన్నై: దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే తమిళనాడులో సైతం గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరిగి పోతున్నాయి. జనం భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వీధుల్లోకి రావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. మాస్కులు ధరించని వారికి భారీ జరిమానాలు విధిస్తూ ఉంది. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చెన్నై వీథుల్లో జనానికి మాస్కులు పంచుతూ కనిపించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంనుంచి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లే దారిలో కొంత మంది మాస్కులు ధరించకుండా ఉండడం చూసిన స్టాలిన్ తన కారును ఆపి వారికి మాస్కులు అందజేయడమే కాకుండా ఒక వ్యక్తి మాస్కు పెట్టుకోవడంలో సైతం సహకరించారు. ‘ దయచేసి అందరూ మాస్కు ధరించండి’ అని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌పై వైద్యుల సలహాలను పాటించాలని,లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
MK Stalin distributes masks to people in Chennai