రూ.10వేలు పలికిన పత్తి.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు పత్తితో అభిషేకం చేసిన రైతులు
మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఘనంగా సంబరాలు నిర్వహించిన రైతులు, వ్యాపారులు
హైదరాబాద్: తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్ల బంగారానికి రికార్డ్ ధర పలికింది. ఏకంగా క్వింటాల్‌కు 10వేల రూపాయలు పలికి అల్ టైం రికార్డ్ కు చేరింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంతగా క్వింటాల్‌కు 10వేలకు చేరడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం పత్తి మార్కెట్ నందు రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పత్తితో అభిషేకం నిర్వహించారు. పత్తితో మన రైతు బంధు కెసిఆర్ అని రాసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎఎంసి చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మార్కెట్ సెక్రటరీ మల్లేష్, మంత్రి పిఎ సిహెచ్ రవికిరణ్ ఆధ్వర్యంలో మార్కెట్ నందు సంబరాలు నిర్వహించారు. మంచి లాభసాటి ధర రావటంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతు పెట్టుబడి సాయంతో నేడు వ్యవసాయం సాఫీగా చేసుకుంటున్నారని ప్రశంసించారు. ఈసారి పత్తి దిగుబడి తక్కువ రావడంతో రేటు ఎక్కువ ఉంటుందని రైతులు, వ్యాపారులు భావించారని వివరించారు. గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ నూలుకు అధిక డిమాండ్ ఉన్నందున ధర పెరిగే అవకాశం లేకపోలేదన్నారు.