సౌతాఫ్రికా జయకేతనం
రెండో టెస్టులో భారత్ ఓటమి, 1-1తో సిరీస్ సమం
కదం తొక్కిన ఎల్గర్, రాణించిన డుసెన్, బవుమా
జోహెన్నస్‌బర్గ్: భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్యదక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్ 1-1తో సమం చేసింది. 240 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. గురువారం నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో తొలి రెండు సెషన్‌ల ఆటను రద్దు చేశారు. అయితే మూడో సెషన్‌లో దక్షిణాఫ్రికా ధాటిగా ఆడి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 118/2 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు కెప్టెన్ డీన్ ఎల్గర్ అండగా నిలిచాడు. అతనికి వండర్ డుసేన్ సహకారం అందించాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన డుసేన్ ఐదు ఫోర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఎల్గర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును గెలుపు బాటలో నడిపించాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఎల్గర్ 188 బంతుల్లో పది ఫోర్లతో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు టెంబా బవుమా 23(నాటౌట్) తనవంతు సహకారం అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202, రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసింది. సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 229 పరుగులు సాధించింది. కాగా, తొలి టెస్టులో టీమిండియా జయకేతనం ఎగుర వేసిన విషయం తెలిసిందే.
South Africa defeat India by 7 wickets in 2nd Test