బిజెపి ఎంపి అర్వింద్‌కు హైకోర్టు ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని బిజెపి ఎంపి అర్వింద్‌కు శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు చేశారన్న కేసులో ఎంపి అర్వింద్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని అర్వింద్‌కు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం దుకాణాల వేళలు పొడిగించిన సందర్భంలో సిఎం కెసిఆర్‌ను కించపరిచేలా కార్డూన్ పోస్టు చేశారని అర్వింద్‌పై అభియోగం నమోదైన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అర్వింద్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. కేరికేచర్ రూపొందించే హక్కు ఉంటుంది కానీ రాజ్యాంగపరమైన ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని గౌరవించాల్సిన అవసరం కూడా ఉందని ఎంపి అర్వింద్‌ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. బంజారాహిల్స్ కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
బొడిగె శోభను విడుదల చేయండి
బిజెపి నేత,చొప్పదండి మాజీ ఎంఎల్‌ఎ బొడిగె శోభను రూ.25 వేల పూచీకత్తుతో వెంటనే విడుదల చేయాలని శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ శోభ వేసిన అత్యవసర పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపి స్టే విధించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జన జాగరణ దీక్షకు సంబంధించిన కేసులో బొడిగె శోభను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.దీంతో తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ శోభ వేసిన అత్యవసర పిటిషన్ న్యాయస్థానం విచారణ చేపట్టింది. బొడిగె శోభ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కరీంనగర్ పోలీసులను ఆదేశిస్తూ.. కేసు విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.