ఐటిఐఆర్‌పై పునరాలోచించండి, రాష్ట్రానికి రెండు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్‌లు మంజూరు చేయాలి
24వ జాతీయ ఇ-గవర్నెన్స్ వేదికగా కేంద్రమంత్రికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ వినతి
టి-యాప్ ద్వారా రోజుకు 270రకాల ప్రభుత్వ సర్వీసులందిస్తున్నాం
టి ఫైబర్ ద్వారా 30వేల ప్రభుత్వ కార్యాలయాలు, 80లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పిస్తాం
ప్రపంచ డేటా పవర్ హౌస్‌గా భారత్ : కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
మనతెలంగాణ/ హైదరాబాద్: ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీలో తెలంగాణ ముందుంజలో ఉందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం 24వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ప్రారంభ వేడుకలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, ఐటి శాఖ స్పెషల్ సిఎస్ జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణకు కేటాయించిన ఐటీఐఆర్‌ను కేంద్ర ప్రభు త్వం వెనక్కి తీసుకుందని.. దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. డిజిటల్ లావాదేవీల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీ వ్యాలెట్‌ను తీసుకొచ్చిందన్నారు. ఈ -గవర్నెన్స్‌తో పాటు ఎమ్ (మొబైల్) గవర్నెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. టీ-యాప్ ద్వారా రోజుకు 270కి పైగా వివిధ ప్రభుత్వ సర్వీసులను అందిస్తున్నామని చెప్పారు.
ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను పలు ప్రభుత్వ శాఖల పనితీరులో భాగస్వామ్యం చేసి సమస్యలు, సవాళ్లకు చెక్ పెట్టామన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా సిటిజెన్ సర్వీసెస్‌ను అందజేస్తున్నామని చెప్పారు. ఫెస్ట్ యాప్ ద్వారా 17 సేవలను రవాణా శాఖ ద్వారా అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యత కోసం డిజిటల్ ఇన్ఫాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నామని కెటిఆర్ చెప్పారు. ఇందుకు టీ -ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా 30వేల ప్రభుత్వ కార్యాలయాలు, 80 లక్షల గృహాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రమని.. ఇతర రాష్ట్రాలతో కలిసి తమ పరిశోధన మూలాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్‌లకు అదనంగా మరో రెండు ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలను కేటాయించాలన్నారు.
స్పేస్ రీసెర్చ్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్‌స్పేస్ సెంటర్‌ను నగరంలో ఏర్పాటు చేయాలని కెటిఆర్ కోరారు. అంతరిక్ష మంత్రిత్వ (స్వతంత్ర) శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ దేశంలో డిజిటల్ విప్లవం ప్రారంభం అయ్యిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ డేటా పవర్ హౌస్‌గా భారత్ అవతరించిందన్నారు.చట్టపరమైన చర్య లు, ఇతర మార్గాల ద్వారా సమాచార గోప్యత పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. డిజిటల్ విధానం దేశం ప్రజలకు జీవన సౌలభ్యాన్ని అం దించిందన్నారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధృవీకరణ పత్రం లేదా విద్యుత్ బిల్లు చెల్లింపు, నీటి బిల్లు లేదా ఆదాయపు పన్ను రిటర్న్ లను ఇప్పుడు డిజిటల్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా వేగంగా, సులభంగా జరుగుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ సేవలను సర్వీస్ కేంద్రాల ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు.