Saturday, November 23, 2024

శివరాజ్ దొడ్డిదారి సిఎం

- Advertisement -
- Advertisement -

TS Ministers fires on Shivraj Singh Chauhan

సిఎం కెసిఆర్‌ను విమర్శించే అర్హత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి లేదు
తెలంగాణ అంటేనే బిజెపి పాలిత రాష్ట్రాలకు కంటగింపు
హరీశ్ సహా పలువురు మంత్రుల ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై రాష్ట్ర మంత్రులు శివాలెత్తారు. మూకుమ్మడిగా తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఆయనకు సిఎం కెసిఆర్‌పై ఆరోపణలు చేసే స్థాయి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దొంగచాటుగా ఎన్నికైన ముఖ్యమంత్రి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణతో మధ్యప్రదేశ్‌కు పోలికనా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన ఏడేళ్లలో జరిగిన అద్భుత ప్రగతి ముందు…ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి రూపాయిలో నయాపైస వంతు కూడా ఉండదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న అహంతో బిజెపి పాలిత ముఖ్యమంత్రులు ఇక్కడకు తమ నోటికి ఇష్టం వచ్చినట్లుగా సిఎం కెసిఆర్‌పై విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఈ సందర్భంగాహెచ్చరించారు. ఇక్కడ ఎవరూ అంత చేతకాని వాళ్లు లేరన్నారు. తమ రాష్ట్రానికి వచ్చిన అతిథులన్న మర్యాదతోనే వారిని క్షేమంగా వెళ్ళినిచ్చామన్నారు. లేని పక్షంలో టిఆర్‌ఎస్ పార్టీ తలుచుకుంటే బిజెపి పాలిత ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి క్షేమంగా వెళ్ళిగలిగేవారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి…బిజెపి పాలత రాష్ట్రాల్లో ఎక్కడైనా చూపించగలరా? అని రాష్ట్ర మంత్రులు సవాల్ విసిరారు. కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాలకు తెలంగాణ అంటే కంటకింపుగా మారిందన్నారు.

తమ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రులు విమర్శించారు. అందుకే తమ రాష్ట్రానికి మరీ వచ్చి….టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు, విమర్శలు చేసి పోతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు బిజెపి నాయకులు ఎంత రెచ్చగొట్టినా తాము మౌనంగా ఉన్నామని…ఇకపై మాత్రం అలా ఉండబోమని హెచ్చరించారు. వారి విమర్శలకు పదిరెట్ల విమర్శలు చేస్తామన్నారు. అలాగే ఆరోపణలకు తగు రీతిలో బదులిచ్చితీరుతామని శనివారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు.

బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తోంది

బిజెపిముఖ్యమంత్రులు,- సీనియర్ నేతలు టూరిస్ట్‌ల్లా వచ్చి సిఎం కెసిఆర్‌పై చేసిన విమర్శలను ఖండిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. కెసిఆర్‌కు దమ్ముందో లేదో ప్రధాని నరేంద్రమోడీని అడిగి తెలుసుకోవాలని శివారాజ్‌సింగ్ చౌహన్‌కు సూచించారు. బిజెపికి అతిగతి లేకనే చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ఢిల్లీలో చర్చకు రమ్మన్నా వచ్చే ధైర్యం తమకుందన్నారు.

ఇందుకు బిజెపి నాయకులు సిద్ధమేనా అని ఆయన సవాల్ విసిరారు. ఉత్తుత్తి డ్రామాలు చేస్తూప్రజలను రెచ్చకొట్టేందుకు యత్నిస్తున్నారని మంత్రి తలసాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చే బిజెపి నేతలు రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టు తీసుకోని రావొచ్చు కదా? అని ప్రశ్నించారు.దేవాలయాలు ఎవరి ఆధ్వర్యంలో అభివృద్ధి అయిందో చర్చకు కూడా తాము సిద్దమేనని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికికైనా వెళ్లు…. లేదా యాదాద్రి… భద్రాచలానికి ఎక్కడికి వెళ్లాలనుకున్నా తీసుకపోతామన్నారు.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్రమోడీ ప్రజలపై మొసలి కన్నీరు పెడుతున్నారన్నారు. పంజాబ్‌లో అక్కడి రైతులు మోడీని ఎందుకు ఆపారో విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉందన్నారు. కేవలం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందడానికి పదేపదే ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని కోవిడ్ నిబంధనలు పాటించాలని పదేపదే సూచిస్తున్నారని….అవి బిజెపి నేతలకు వర్తించవా? అని నిలదీశారు.

దొడ్డిదారిన సిఎం అయ్యాడు

ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని విమర్శించడం పద్ధతేనా? మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రహదారిలో అధికారంలోకి రాగా… శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజా పథకాలతో- రాష్ట్ర ఏకానామికల్ స్థాయిపై చౌహన్ మాట్లాడితే బాగుండేదన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కారమంగా ప్రపంచంలోనే భారతదేశానికి మంచి పేరు వస్తోంది నిజంకాదా? ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి శివరాజ్‌సింగ్ మతిభ్రమించినట్లు మాట్లాడుతారా? అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అంటే ఏంటో మీ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతిని అడిగి తెలుసుకోవాలని చౌహన్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. తెలంగాణ అభివృద్ధిని చోహన్ మరో పది సార్లు సిఎం అయినా చేయలేరన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చే జీతాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. అక్కడ ఇచ్చి…… ఇక్కడికి వచ్చి మాట్లాడాలన్నారు. తమకు తిక్కలేస్తే మధ్యప్రదేశ్‌లో మీటింగ్ పెట్టి….టిఆర్‌ఎస్ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.

భయం అంటే ఏమిటో చూపించే వాళ్లం

సిఎం కెసిఆర్‌ను మరొక్క మాట అంటే శివరాజ్ సింగ్ చౌహాన్‌కు భయం అంటే ఏమిటో చూపించే వాళ్లమని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ తలుచుకుంటే చౌహన్ హైదరాబాద్‌లో ఫ్లైట్ దిగే వాడా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అతిథివి కాబట్టే సేఫ్‌గా వెళ్లావన్నారు. బిజెపి నేతల కల్లోకి కెసిఆర్ వచ్చాడు కాబట్టే వరుసగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌కు క్యూ కట్టారన్నారు. ఇప్పుడు చెప్పాలి- భయం మీకా? కెసిఆర్‌కా? అని అడిగారు. చౌహన్‌కు పాలన సరిగ్గా రాకనే మధ్యప్రదేశ్ ప్రజలు హైదరాబాద్‌కు వలస వస్తున్నారన్నారు. మళ్ళీ తెలంగాణకు ఆయన వస్త్తే వలస కార్మికులే అడ్డుకుంటారు జాగ్రత్త అని హెచ్చరించారు. శివరాజ్ సింగ్ చౌహన్ పరిపాలన సక్కగ ఉంటే మధ్యప్రదేశ్ లో పండిన పంట ఎంత-? తెలంగాణలో పండిన పంట ఎంతో తెలుసుకోవాలన్నారు. ఏమి తెలియకుండా రాష్ట్ర బిజెపి నేతలు ఇచ్చిన స్క్రిప్టును ఉన్నది ఉన్నట్లుగా చదివితే ఎలా? అని గంగుల ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అంటే భిమారి (రోగాల) రాష్ట్రంగా పేర్కొంటారన్నారు. పరిపాలనలో అట్టర్ ఫెయిలూర్ శివరాజ్ సింగ్ చౌహన్ అని మండిపడ్డారు.

భయం అనేది కెసిఆర్ డిక్షనరీలోనే లేదు

దొడ్డిదారిన సిఎం పదవి తెచ్చుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వంపైనా.. సిఎం కెసిఆర్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసి సిఎం అయిన చౌహాన్….టిఆర్‌ఎస్‌కా నీతులు చెప్పేది? అని ధ్వజమెత్తారు. 14 ఏండ్లు ఉద్యమం చేసి స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కెసిఆర్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అసలు భయం అనేదే కెసిఆర్ డిక్షనరీలో లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాలనే ఎదిరించి ధైర్యంగా పోరాడిన ఆయన….బిజెపి తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు కాదని స్పష్టం చేశారు. నల్లసాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులను చంపిన ఘనత మీదన్నారు. ఎదిరించిన వారిపై దాడుల చేసే సంస్కృతి కూడా బిజెపిదేనని ఆయన మండిపడ్డారు. అభివృద్ధిలో మధ్యప్రదేశ్ స్థానం ఎక్కడ? తలసరి ఆదాయంతో పాటు ఇతర రంగాల్లో అట్టడుగున ఉన్న మీ రాష్ట్రంతో తెలంగాణకు పోలిక ఏమిటని ప్రశ్నించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోలు ధరలపై బిజెపి నేతలు బాధపడాలన్నారు. అధికారం, ధన వ్యామోహం తప్పా ప్రజా సమస్యలు ఆ పార్టీ నేతలకు పట్టదని మండిపడ్డారు. ఎన్నికలకు తప్ప ఏ రోజన్నా ప్రధాని నరేంద్రమోడీ బయటకు వచ్చారా? అని ప్రశ్నించారు.

చౌహాన్ పచ్చి అబద్దాలు చెప్పారు

బిజెపి అంటే బేరగాళ్లు… జూటగాళ్ళ లెక్క పార్టీ తయారైందని పియుసి చైర్మన్, ఆర్మూర్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి అన్నారు.ఆ పార్టీలో స్క్రిప్ట్ ఒక్కటే గానీ….డబ్బింగ్ ఆర్టిస్‌లు రోజుకొకరు మారుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను పొగిడిన చౌహన్ రెండు రోజుల క్రితం ఇక్కడకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. మధ్యప్రదేశ్‌లో బలవంతంగా కాంగ్రెస్ శాసనసభ్యులను కొనుగోలు చేసి సిఎం అయిన చౌహాన్…. ప్రజలతో ఎన్నుకోబడిన కెసిఆర్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ వ్యాపమ్ చౌహన్ హయాంలోనే అయిందని ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. దానిని ఎవ్వరూ మర్చిపోలేదన్నారు. 4 సార్లు సిఎం అయిన చౌహన్ మధ్యప్రదేశ్‌లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయా? అని నిలదీశారు. శ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రానికి వచ్చి ఆ రాష్ట్ర సిఎంను తిట్టిన సంస్కృతి లేదన్నారు. మోడీ-తో పాటు 18 బిజెపి రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి తెలంగాణలో కూర్చున్నా… ఆ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సీటు కూడా రాదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News