విజయవాడలో బలవన్మరణానికి పాల్పడ్డ నిజామాబాద్ వ్యాపారి కుటుంబం
సత్రంలో తల్లి, కొడుకు ఆత్మహత్య, నదిలో మరో కుమారుడితో కలిసి దూకిన తండ్రి
మన తెలంగాణ/ నిజామాబాద్, విజయవాడ : నిజామాబాద్ కు చెందిన ఒక కుటుంబం విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడింది. కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. భార్య, భర్త, ఇద్దరు కుమారులు వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్‌లోని గంగస్తాన్ ఫేస్ 2లోని శ్రీ చైతన్య అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న పుప్పాల సురేష్ కుటుంబంతో కలిసి ఈనెల 6వ తేదీన అమ్మవారి దర్శనం కోసం విజయవాడ వెళ్ళి దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్‌లోని వారి కుటుంబీకులకు తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. కంగారు పడిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు ఎక్కడ దిగారు తెలియక పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. కాగా, శనివారం ఉదయం కృష్ణ నదిలో రెండు మృతదేహాలు లభ్యం కాగా, బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంలోని గదిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను పప్పుల సురేష్(54), భార్య శ్రీలత, కుమారులు ఆశిష్, అఖిల్‌గా గుర్తించారు.
తండ్రి సురేష్, పెద్ద కొడుకు ఆశిష్ ప్రకాశం బ్యారేజ్‌పై నుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోగా.. తల్లి శ్రీలత చిన్న కొడుకు అఖిల్ సత్రం గదిలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో నిజామాబాద్ పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మందుల దుకాణాన్ని నిర్వహించే సురేష్ ఆ షాపును అమ్మివేసి పెట్రోల్ బంకును లీజ్‌కు తీసుకుని నిర్వహిస్తున్నాడు. కాగా, బంక్ నిర్వహణలో నష్టాలు రావడంతో తెలిసినవారి దగ్గర, బ్యాంకుల్లోనూ సుమారు రూ.2కోట్ల వరకూ అప్పు లు చేశాడు. అప్పలబాధ ఎక్కువ కావడం, బ్యాంకు అధికారులు వచ్చి రెం డు రోజుల క్రితం అపార్ట్‌మెంట్‌ను సీజ్ చేయడంతో అవమానభారం తో విజయవాడకు వచ్చి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడినట్లు గా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.