ఆగస్టులో నావీకి అందించే యోచన
న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన మొదటి విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్‌కు మూడోదశ ట్రయల్స్ ఆదివారం ప్రారంభమయ్యాయి. వివిధ సంక్లిష్ట పరిస్థితుల్లో సముద్రంలో నౌక పనితీరును పరిశీలించేదుకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని నావీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధువాల్ తెలిపారు. 40,000 టన్నుల బరువుల్ని మోసుకువెళ్లే సామర్థమున్న ఈ నౌక నిర్మాణానికి దాదాపు రూ.23,000 కోట్లు ఖర్చయ్యాయి. గతేడాది ఆగస్టులో ఐదు రోజులపాటు సముద్రంలో నిర్వహించిన ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో పదిరోజులపాటు ట్రయల్స్ నిర్వహించారు. మూడోదశ ట్రయల్స్‌ను డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలతోపాటు పలువురు నావీ నిపుణులు పరిశీలిస్తున్నారు. ట్రయల్స్ పూర్తయితే ఈ ఏడాది ఆగస్టు వరకల్లా భారత నావీకి విక్రాంత్‌ను అందించేందుకు యోచిస్తున్నారు.
ఇటీవల కోచిలో ఐఎసి విక్రాంత్‌ను సందర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతృప్తి వ్యక్తం చేశారని మధువాల్ తెలిపారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తున్న విక్రాంత్ నిర్మాణం 2009లో ప్రారంభమైంది. ఈ యుద్ధనౌక మిగ్29 కె, కమోవ్31 హెలికాప్టర్లు, ఎంఎచ్60 ఆర్ మల్టీరోల్ హెలికాప్టర్లను మోసుకువెళ్తుంది. కొచిన్‌షిప్‌యార్డ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ప్రస్తుతం మన దేశానికి ఉన్న ఒకే ఒక్క విమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య.