న్యూఢిల్లీ : కోర్టులో న్యాయసంబంధ వ్యవహారాలు సజావుగా సాగాలంటే బార్‌కు, బెంచ్‌కు మధ్య సత్సంబంధాలు తప్పనిసరి అని సుప్రీం కోర్టు సూచించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జికి వ్యతిరేకంగా ఒక న్యాయవాది చేసిన అవమానకర వ్యాఖ్యలపై విచారణకు దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్‌లు ఎంఆర్‌షా, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించి ఈమేరకు సూచనలు చేసింది. పిటిషనర్ అయిన అడ్వకేట్ తాలూకు ప్రవర్తనపై చర్య తీసుకోవాలని కోరుతూ బార్ కౌన్సిల్‌కు హైకోర్టు సూచిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై ఆ అడ్వకేట్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. కోర్టుల్లో వ్యవహారాలు సజావుగా సాగడానికి భార్ కౌన్సిల్‌కు, బెంచ్ (ధర్మాసనం)కు మధ్య సత్సంబంధాలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. కోర్టులో వికృత ప్రవర్తన వల్ల ఏ అడ్వకేట్ ప్రయోజనం పొందలేరని పేర్కొంది. పర్యవసానంగా కోర్టు గదిలో వాతావరణం చెడిపోతుందని, పిటిషనర్ తాలూకు వ్యాజ్యం దెబ్బతింటుందని, తన వంతు పొరపాటేమీ లేక పోయినా పిటిషన్ దారుడు బాధపడవలసి వస్తుందని సూచించింది.
ఉత్తరాఖండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఆ న్యాయవాది తాను చేసిన వ్యాఖ్యలకు షరతులు లేని క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించింది. దాంతో ఆ న్యాయవాది ఒకవంక క్షమాపణ చెబుతూ మరోవంక సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు ఆ న్యాయవాదిని హైకోర్టు జడ్జి ముందర హాజరు కావాలని, క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అలాగే న్యాయవాది క్షమాపణను పరిశీలించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. పిటిషనరు తరఫున క్షమాపణను అంగీకరించిన హైకోర్టు , మొదట 2021 డిసెంబర్ 24 న ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకున్నట్టు ధర్మాసనం వెల్లడించింది.