Friday, November 22, 2024

ఆందోళన వద్దు అశ్రద్ధ చేయొద్దు

- Advertisement -
- Advertisement -

CM KCR review on corona condition medical readiness

ఇళ్లలోనే సంక్రాంతి జరుపుకోండి

కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వ్యాధి లక్షణాలుంటే వెంటనే పరీక్షలు
మాస్కు, భౌతికదూరం తప్పనిసరి
పిల్లలకు టీకాపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి
నేటి నుంచి వృద్ధులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు
రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వైద్యశాఖ సన్నద్ధతపై సిఎం సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచించారు. విధిగా స్వీయ నియంత్రణా చర్యలను చేపట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను కూడా పాటించాలన్నారు. అయితే కరోనా సోకినా ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతిభవన్‌లో ఆదివారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆరోగ్యశాఖతో పాటు రోడ్లు భవనాలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతిపై కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, కరోనా పట్ల ప్రజలు భయాందోళనలు చెందొద్దన్నారు. అయితే అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను సానిటైజేషన్ చేసుకోవడంపై నిర్లక్షం వహించరాదన్నారు. అలాగే భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సిఎం కెసిఆర్ కోరారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలన్నారు. ప్రస్తుతం 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందన్నారు. అందువల్ల తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా తమ పిల్లలకు విధిగా వాక్సిన్ వేయించాలన్నారు.

నేటి నుంచి బూస్టర్ డోస్

నేటి ( సోమవారం) నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. అర్హులైన వారందరూ తప్పని సరిగా వాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సిఎం సూచించారు.

ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్దంగా ఉందని సిఎం పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సిఎం అడిగి తెలుసుకున్నారు. గత సమీక్షలో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు సిఎంకు నివేదించారు. ఆక్సీజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా ఉన్నాయని అధికారులు సిఎంకు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News