చింతపల్లి: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం చింతపల్లి- మాల్ మధ్యలో ప్రధాన రహదారిపై విరాట్‌నగర్ స్టెజీ సమీపాన మెట్టు మహాంకాళి మైసమ్మ ఆలయం బైట దేవతా విగ్రహం ముందు మనిషి తలను స్థానికులు గుర్తించారు. ఈ ఘటన సోమవా రం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారు జామున రోడ్డుపై స్థానికులు వాకింగ్ చేస్తుండగా హైదరాబాద్- నాగార్జునసాగర్ జాతీయ రహదారిలో గొల్లపల్లి గ్రామంలోని మెట్ట మహాంకాళి దేవాలయంలో దేవతా విగ్రహం కాళ్ళ వద్ద గుర్తు తెలియని మొండెం నుంచి వేరు చేసిన తలను వదిలి వెళ్లడంతో ప్రజలు గుర్తించారు. గ్రామస్థుల సమాచారం మేరకు… దేవరకొండ డిఎస్ పి ఆనంద్ రెడ్డి, నాంపల్లి సిఐ సత్యం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ కు చెందిన జయేందర్ నాయక్ గా గుర్తించారు.
జయేందర్ నాయక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతడికి మానసిక సమస్యలు ఉండడంతో తండ్రి రమావత్ శంకర్ నాయక్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించారు. మానసిక సమస్యలు అలాగే ఉండడంతో తల్లిదండ్రులు అతడిని వదిలిపెట్టారు. జయేందర్ ను నరబలి ఇచ్చారా ? లేక క్షుద్ర పూజల కోసం బలి ఇచ్చారా? లేక గుప్త నిధుల కోసం హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాలలో సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సిఐ సత్యం తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు. గతంలో గుప్త నిధుల కోసం వెతికినా వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. తలను డిఎన్ఎ పరీక్షల కోసం హైదరాబాద్ కు తరలించామని పోలీసులు తెలిపారు.