న్యూఢిల్లీ: కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైద్య కేంద్రాల వద్ద మెడికల్ ఆక్సిజన్ లభ్యత ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యకార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. కనీసం 48 గంటలకు సరిపడా బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. పీఎస్‌ఎ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పనితీరును నిర్ధారించుకోవడంతోపాటు సిలిండర్ల లభ్యతను సరిచూసుకోవాలని కోరారు. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇన్‌పేషెంట్ కేర్ ఆక్సిజన్ చికిత్స కేంద్రాల వద్ద 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ కలిగి ఉండాలన్నారు. వైద్య కేంద్రాల వద్ద లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ) తగిన స్థాయిలో నింపి ఉండాలని, వాటి రీఫిల్లింగ్ విషయంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఆక్సిజన్ డెలివరీ పరికరాలను వినియోగించేటప్పుడు ఇన్‌ఫెక్షన్ నివారణ ప్రోటోకాల్ అనుసరించాలన్నారు. ఆక్సిజన్ సంబంధ సమస్యలు, సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు ఆక్సిజన్ కంట్రోలు రూమ్‌లను పునరుద్ధరించాలని, వైద్య కేంద్రాల వద్ద ఆక్సిజన్ నిర్వహణకు శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
Union Health Ministry letter to States over Oxygen