కాంగ్రెస్, ఎస్‌పి ఎమ్మెల్యేలు చేరిక
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేష్ సైని, సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్ బుధవారం బిజెపిలో చేరారు. వీరిద్దరి చేరికతో రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామాతో ఎదురుదెబ్బను చవిచూసిన యుపి బిజెపికి కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు సమాజ్‌వాది పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధర్మపాల్ సింగ్ కూడా బుధవారం యుపి ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఇలా ఉండగా&ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బిజీగా ఉన్నారు. మొదటి దశలలో జరిగే ఎన్నికలకు సంబంధించి బిజెపి అభ్యర్థుల పేర్ల జాబితాకు తుది రూపం ఇవ్వడంలో ఆయన పార్టీ కేందుర నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
====