Monday, December 23, 2024

ఏక పక్ష విచారణకు వదిలేయలేం

- Advertisement -
- Advertisement -
Supreme Court Panel for PM Modi security lapse
ప్రధాని కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ: ఇటీవల పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఈ దర్యాప్తు కమిటీ ఏర్పాటయింది. జాతీయ భద్రతా సంస్థ అధికారులు, పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్,చండీగఢ్ డిజిపి, పంజాబ్ సెక్యూరిటీ అదనపు డిజిపి, ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. భద్రతా లోపం కారణంగా తలెత్తిన ప్రశ్నలకు ఏకపక్ష విచారణకు వదిలేయలేమని, ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. భద్రతా లోపానికి కారణం, బాధ్యులెవరో గుర్తించడంతో పాటు భవిష్యత్తులో ఈ తరహా పరిణామాలు చోటు చేసుకోకుండా తీసుకోవలసిన చర్యలపై కూడా ఈ కమిటీ దృష్టిసారించనుంది.

ఈ నెల 5న ప్రధానమంత్రి పర్యటనకు చేసిన భద్రతా ఏర్పాట్లకు సంబంధించి స్వాధీనం చేసుకున్న అన్ని డాక్యుమెంట్లను తక్షణం దర్యాప్తు కమిటీ అధిపతికి అందజేయాలని సుప్రీంకోర్టు పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. అలాగే వీలయినంత త్వరగా కమిటీ తన నివేదికను సమర్పించాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం కోరింది. ఈ నెల 5న ప్రధాని మోడీ పంజాబ్‌లో పర్యటించారు. వాతావరణం అనుకూలించక ఆయన రోడ్డుమార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. దీనిపై ముందుగా పంజాబ్ డిజిపికి సమాచారమిచ్చారు. మోడీ ప్రయాణించే మార్గంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీసుల ధ్రువీకరణ తర్వాతే ప్రధాని కాన్వాయ్ లో బయలుదేరారు. కానీ మార్గమధ్యంలో ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకునే సరికి అప్పటికే కొందరు ఆందోళనకారులు రోడ్డును దిగ్బంధించారు. దీంతో ఫ్లైఓవర్‌పై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.ఈ క్రమంలోనే ప్రధాని కాన్వాయ్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది.

ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు వాహనాలనుంచి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దాదాపు 20 నిమిషాల సేపు ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్‌పైనే చిక్కుకుపోయింది.ఆ తర్వాత కాన్వాయ్ వెనుదిరిగి భటిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయింది. సాధారణంగా ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గంలో కఠినమైన భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటిస్తారు. సాధారణ వాహనాలను అనుమతించరు. అలాంటిది ప్రధాని ట్రాఫిక్‌లో చిక్కుకు పోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర విచారణ కమిటీని వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర, పంజాబ్ ప్రభుత్వాలు నియమించిన కమిటీలు తమ దర్యాప్తులను నిలిపివేయాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News