నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. అది సీజన్ కాదు. మా నిర్మాత ధైర్యంతో రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు ఈ ఘన విజయాన్ని అందించారు. ధైర్యం చేసి రిలీజ్ చేసిన నిర్మాతకు నా అభినందనలు. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అయింది. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. పాకిస్తాన్‌లో సైతం మన ‘అఖండ’ గురించి మాట్లాడుకుంటున్నారు.
మేం అఖండ సినిమా చేసేటప్పుడు సింహ, లెజెండ్ గురించి ఆలోచించలేదు. నమ్మకంతో పని చేస్తే ఫలితం దేవుడు చూసుకుంటాడు. ఈ ఫలితం ఆ దేవుడు ఇచ్చిందే. అందరి నుంచి మంచి నటనను రాబట్టుకునే సత్తా ఉన్న దర్శకుడు బోయపాటి. ఆయన దేశం గర్వించదగ్గ దర్శకుడు. ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమకు సహకారం అందించాలి. ఏపిలో టికెట్ ధరల వివాదంపై చిత్ర పరిశ్రమ కలిసికట్టుగా ఉండాలి” అని అన్నారు. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ఇది డబుల్ సక్సెస్ మీట్. బ్లాక్ బస్టర్, హిట్, జాతర అని అంటున్నారు. అన్నింటికంటే ఇది ఎక్కువ. డబ్బు రావడం వేరు. ధైర్యం రావడం వేరు. ఈ సినిమాతో అందరికీ ధైర్యం వచ్చింది. బాలయ్య నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే ఈ సినిమాను చేయగలిగాను. ఈ పాత్ర గురించి చెప్పితే ఒక్క ప్రశ్న కూడా వేయలేదు.
ఈ రోజు సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది” అని తెలిపారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా విడుదలయ్యే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పరిస్థితి ఘోరంగా ఉండేది. జనాలు వస్తారా? థియేటర్లు నిండుతాయా? అని అనుకున్నారు. ఆ సమయంలో అఖండ సినిమాను విడుదల చేశాం. డిస్ట్రిబ్యూటర్లంతా కూడా ధైర్యం చేసి విడుదల చేశారు. ప్రేక్షకులు ఆదరించడం వల్లే ఈ సినిమా ఘన విజయం సాధించింది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అయ్యప్ప శర్మ, రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.