Sunday, November 24, 2024

జాతీయ ప్రత్యామ్నాయ యత్నాలు

- Advertisement -
- Advertisement -

covid 19 second wave in india

దేశ ఆకాశాన్ని ఏడేళ్లుగా కమ్ముకొన్న కాషాయాంబరం వెలిసిపోతున్న సంకేతాలు వెలువడుతున్నాయనుకోవచ్చా?రాజ్యాంగం రంగు మార్చకుండానే దిక్కు మార్చేస్తున్న ఉక్కు చేతుల దిక్కుమాలిన పాలనకు ప్రజలు స్వస్తి చెప్పే రోజులు చేరువవుతున్నాయని ఊహించవచ్చా? త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఊపందుకొంటున్న కొత్త పొత్తులు, కలయికల అద్దంలో వొక స్పష్టాస్పష్ట సువిశాల బిజెపి వ్యతిరేక ఐక్యత ప్రతిబింబించడం లేదా? బుధవారం నాడు చోటు చేసుకొన్న మూడు పరిణామాలు ఈ ప్రశ్నలకు అవునని స్పష్టంగా సమాధానం చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి, ఒబిసి నాయకుడు స్వామిప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆదిత్యనాథ్ ప్రభుత్వం దళితులు, ఒబిసిలు, రైతులు, యువతరం ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు.

కీలక శాసన సభ ఎన్నికలకు గట్టిగా నెల రోజులైనా వ్యవధి లేని సమయంలో, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కొద్ది రోజుల్లోనే ఒబిసి వర్గానికి చెందిన సీనియర్ మంత్రి దూరం కావడం, ఆయన వెంట మరి ముగ్గురు బిసి, దళిత వర్గాల ఎంఎల్‌ఎలు బిజెపి కూటమి నుంచి వైదొలగుతుండడం యుపిలో కమలం పార్టీకి నష్టదాయకమే.ఇదే సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ యుపి ఎన్నికల నేపథ్యంలో చేసిన వొక ప్రకటన గమనించదగినది. ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకొంటున్నారని, దాని కోసం ఎదురు చూస్తున్నారని శరద్ పవార్ ప్రకటించారు. తమ పార్టీ యుపి ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్టు చెప్పారు. గోవాలో కాంగ్రెస్, శివసేన, తృణమూల్ కాంగ్రెస్‌లతో పొత్తు పెట్టుకొంటామని తెలియజేశారు. యుపిలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. శరద్ పవార్ గత కొంత కాలంగా జాతీయ స్థాయిలో బిజెపికి గట్టి ప్రత్యామ్నాయం కోసం పని చేస్తున్నారు. అది కాంగ్రెస్ సహితంగా ఉండాలా, అది లేకుండానా అనే మీమాంస నడుస్తున్నది. ఈలోగా తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, బెంగాల్ సిఎం మమత బెనర్జీ ప్రధాని పీఠం మీద మక్కువతో ఒంటరిగా చేస్తున్న కృషికీ ఆయన మద్దతు ఇస్తున్నారు. పవార్ ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్‌తో కలిసి సాగించే ప్రయాణం జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ నిర్మాణంలో కొత్త పుంతలకు దోహదపడవచ్చు.

ఇంకొక వైపు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న పరిణామాలకు విశేష ప్రాధాన్యం ఉంది. జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ చిరకాలంగా చేస్తున్న కృషి తెలిసిందే. ఈ దిశగా గతంలో మమతా బెనెర్జీ తదితరులను కలుసుకొన్న ఆయన ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత స్టాలిన్‌తో కూడా చెన్నైలో భేటీ అయ్యారు.రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కాలరాస్తూ, రైతుల ప్రయోజనాలను హరిస్తున్న కేంద్రం విధానాలను గట్టిగా ప్రతిఘటించవలసిన అవసరంపై కెసిఆర్, స్టాలిన్‌ల మధ్య ఏకీభావం కుదిరినట్టు వార్తలు వచ్చాయి. నిన్నగాక మొన్న రెండు వామపక్షాల అగ్ర నేతలూ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలుసుకొని పబ్లిక్ రంగ సంస్థలను గంపగుత్తగా ప్రైవేటుకు ధారాదత్తం చేయడం తదితర కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల గురించి చర్చించారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య సాగుతున్న హోరాహోరీ నేపథ్యం కెసిఆర్ జాతీయ ప్రత్యామ్నాయ వ్యూహానికి బలం చేకూరుస్తున్నది.కేంద్రంలోని బిజెపి పాలకుల అసమర్ధ, అప్రజాస్వామిక, రైతు వ్యతిరేక విధానాలపై కెసిఆర్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.

ఆయన యత్నాలకు కొత్త కోణాన్ని చేరుస్తూ బీహార్ ప్రతిపక్ష నేత, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సిఎం కాబోయి కొద్దిలో తప్పిపోయిన ఆర్‌జెడి అధినేత తేజస్వి యాదవ్ హైదరాబాద్ వచ్చి కెసిఆర్ ను మంగళవారం నాడు కలుసుకొన్నారు. గతంలో అద్వానీ రథయాత్రను అడ్డుకొని బిజెపికి కొరుకుడుపడని నేతగా పేరు తెచ్చుకొన్న, బీహార్‌లో మహాఘట్ బంధన్ ప్రయోగాన్ని విజయవంతంగా నడిపించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో ఈ సందర్భంగా కెసిఆర్ జరిపిన టెలిఫోన్ సంభాషణకు మంచి ప్రాధాన్యం ఉంది. జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా బలమైన సెక్యులర్ ఫ్రంట్ నిర్మాణం లో విశిష్ట పాత్ర పోషించాలని, ఆ కృషికి నాయకత్వం వహించాలని కెసిఆర్‌ను లాలూ కోరడం, ఈ విషయమై చర్చించడానికి పాట్నా రావాలని ఆహ్వానించడం గుణాత్మకమయిన మలుపు. బిజెపికి ప్రత్యామ్నాయ నిర్మాణంలో ఉత్తరాదివారి కంటే దక్షిణాది నేతలకే యెక్కువ స్పష్టత ఉన్నట్టు కనిపిస్తున్నది. వీరి అండదండలతో దేశంలోని అన్ని బిజెపి వ్యతిరేక శక్తుల మధ్య గట్టి బంధం ఏర్పడితే అది హర్షించవలసిన పరిణామం అవుతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే ఈ ప్రయత్నాలు వొక పటిష్ఠమైన రూపు తీసుకోగలవు. బిజెపి తోక ముడవడం అక్కడితోనే ఆరంభమవుతుంది. దేశానికి అసలయిన విముక్తి మార్గం తెరుచుకోవడం మొదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News