Saturday, January 4, 2025

‘శరణం అయ్యప్ప’ ఎలా వచ్చింది?

- Advertisement -
- Advertisement -

Sabarimala

పదో శతాబ్దం వరకు కేరళ ప్రాంతం బౌద్ధుల, జైనుల ప్రాబల్యంలో వుంది. అందుకు ఆధారాలు చాలా దొరికాయి. ఆ కాలపు బుద్ధుడి విగ్రహాలెన్నో కేరళ తవ్వకాల్లో బయటపడ్డాయి. అలపుజ (కరుమాదికుట్టన్), నెయ్యంటింకర, కరునాగప్పల్లి, ఇడప్పల్లి, మావెలిక్కర వంటి చోట్ల దొరికిన విగ్రహాలు ముఖ్యమైనవి. బౌద్ధం బాగా వ్యాప్తిలో వుండేదనడానికి, రూపు రేఖలు మార్చుకున్న నాటి ఆరామాలు సాక్షం చెపుతున్నాయి. 1012 శతాబ్దాల మధ్య కాలంలోనే అక్కడ హిందూ మతం మెల్లగా ప్రారంభమైంది. దానికి మూల కారకుడు పరమర పరుసురామ (క్రీ.శ. 970) కేరళ ప్రాంతాన్నంతా ఆక్రమించిన ఆయన, జనాన్ని క్రమంగా హిందూ మతంలోకి మార్చడం ప్రారంభించాడు.

గొడ్డలి ఆయుధంగా ధరించిన పరుసురామ మనకు హిందూ మత గ్రంథాల్లో కనిపిస్తాడు. బుద్ధుణ్ణి దశావతారాల్లో కలుపుకున్నట్టు తర్వాత కాలంలో ఈ పరుసురామను కూడా కలుపుకున్నారేమో తెలియదు. ఆ కాలంలో గొడ్డలి చాలా ప్రాచుర్యంలో ఉన్న ఆయుధం. సైనికులందరూ దాదాపు ఆ ఆయుధాన్నే వాడేవారు. ఎదురు లేని వీరుడైన పరమర పరుసురామ ఆ ప్రాంతంలో వున్న బౌద్ధ మత కేంద్రాలన్నింటినీ హిందూ దేవాలయాలుగా మార్చేశాడు. వాటిని బ్రాహ్మణులకు బహుమతిగా ఇచ్చి హిందూ ధర్మానుసారం నిర్వహించాల్సిందిగా ఆదేశించాడు. తర్వాత కాలంలో ఆ ప్రాంతాన్ని చోళులు ఆక్రమించారు. వారి కాలంలో బౌద్ధ విహారాలన్నీ శివాలయాలయ్యాయి. జైన విహారాలు విష్ణు మందిరాలయ్యాయి. మహిళా భిక్షుకులు నివసించే ఆరామాలు దేవీ ఆలయాలయ్యాయి.

ధర్మాన్ని ప్రతిష్టాపించడానికి ఏర్పర్చిన ఈ హిందూ దేవాలయాలన్నీ ఒకప్పుడు కొల్లగొట్టిన బౌద్ధ, జైన విహారాలేనన్నది వాస్తవం. నివాస ముంటున్న భవనాల నుండి తరిమేస్తే ఆనాటి బౌద్ధ, జైన భిక్షుకులు ఎంత యాతన పడ్డారన్నది, దాని వెనక ఎంత హింస వుంటుందన్నది ఊహించుకోవాల్సిందే! రాజు ఏమతాన్ని నమ్మితే ప్రజలు తప్పని సరిగా ఆ మతాన్నే నమ్ముకోవాలన్నది ప్రపంచ వ్యాప్తంగా వున్నదే. విహారాలకు మార్పులు, చేర్పులు చేయడం, బుద్ధుడి, జైనుడి ప్రతిమల్ని మార్చుకోవడం ఏ ధర్మ సంస్థాపన కోసం అని ఇప్పుడు ఎవరూ ఎవరినీ అడిగే పని లేదు. అడిగినా, అడగకపోయినా చరిత్ర సాక్షాలు చూపుతూనే వుంది. చూడలేని గుడ్డివాళ్లకు మనం చూపించలేం. ఉత్సుకతతో విశ్లేషించుకునే వారికి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.

అయ్యప్ప దేవళంగా ప్రసిద్ధి పొందిన నేటి శబరిమల ఒకప్పటి బౌద్ధ క్షేత్రం. క్రీ.శ 1600 లలో అది తమిళ మరవర్ల ఆధీనంలో వుంది. పండలం రాజు ఆ ప్రాంతాన్ని జయించి స్వాధీనం చేసుకున్నాడు. బౌద్ధ, జైన క్షేత్రాల్ని హిందూ దేవళాలుగా మార్చడం అంతకు ముందే నుండే అక్కడ ప్రారంభమైంది కనుక, పండలం రాజు కూడా ఆ పనిని మరింత ఉత్సాహంగా కొనసాగించాడు. ఫలితంగా అప్పటి దాకా బౌద్ధుడి విగ్రహంతో వున్న ప్రార్థనా మందిరం అయ్యప్ప దేవాలయంగా మార్చబడింది. అయ్యప్ప అనే దేవుడి పేరు హిందూ పురాణాలలో ఎక్కడా లేదు. మరి ఎలా వచ్చింది? వైష్ణవులు, శైవులు బాగా బలపడి వున్న కాలమది. అందువల్ల హిందువుల్లోనే కొంత ఘర్షణ జరిగింది. ఆ స్థలం, ఆ దేవాలయం తమ కంటే తమకని వైష్ణవులు, శైవులు హోరాహోరీగా పోటీ పడ్డారు. ఎవరూ వెనక్కి తగ్గలేదు. అయితే కాలక్రమంలో ఇరు పక్షాలు శాంతించి, రాజీపడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఆ దేవాలయంలో విష్ణు విగ్రహం కాదు, శివుడి విగ్రహమూ కాదు.. వీరిద్దరి పుత్రుడయిన ‘హరిహర పుత్రుడి’ విగ్రహం వుండాలని నిర్ణయించారు. అదే అయ్య అప్పగా ప్రసిద్ధికెక్కింది. ఒకప్పటి బుద్ధుడి విగ్రహం మార్చి దాన్ని అయ్యప్ప విగ్రహంగా మలిచారని పరిశీలనగా చూస్తే అర్థమవుతుంది. బుద్ధుడి విగ్రహాలు చూడండి. కుడి చేయి బొటన వేలికి చూపుడు వేలు ఆన్చి వుంటుంది.

మిగతా మూడు వేళ్లు పైకి లేపి వుంటాయి. అంటే అది జ్ఞానబోధ చేస్తున్న ముద్ర. బుద్ధుడి మూడు వేళ్లు పైకి లేపి ఎందుకు ఉంటాయంటే ఆయన సూచించినవి మూడు విషయాలే గనక (త్రి రత్న) బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. ఈ మూడింటి శరణు వేడాలన్నది బౌద్ధం చెప్పింది. ఇవి హిందూ మతంలో ఎక్కడా లేవు. ఆ శరణు పదం తీసుకుని, మార్చుకుని అయ్యప్ప శరణం స్వామియే శరణం ధర్మశస్ట శరణంగా పాడుకుంటున్నారు. శరణు అని ప్రార్థించడం ఏ హిందూ దేవాలయంలోనూ లేదు. ఇప్పుడు శబరిమలలో వున్న అయ్యప్ప విగ్రహం కూడా చూడండి. అయ్యప్ప కుడి చేయి కూడా అదే జ్ఞానబోధ ముద్రలో వుంటుంది. హిందూ దేవతా విగ్రహాలన్నీ ఆశీర్వదిస్తున్న ముద్రలో వుంటాయి. కాని, జ్ఞానబోధ చేస్తున్నట్టు వుండవు. బుద్ధుడు పద్మాసనంలో చిన్ముద్రలో వుంటాడు. అయ్యప్పలో పద్మాసనాన్ని మార్చారు. తల మీద గుండ్రంగా ముడి వేసి వున్న బుద్ధుడి జుత్తును మార్చి అయ్యప్పకు కిరీటంగా మలిచారు.

తర్వాత కాలంలో హరిహర పుత్రుడి విగ్రహం గురించి ఎవరూ ఘర్షణ పడకుండా, విగ్రహం దరిదాపుల్లోకి సులభంగా చేరుకోకుండా కష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇరుకుగా వుండే 18 మెట్లు ఏర్పాటు చేశారు. చాలా కాలం వరకు… దాదాపు ఇటీవలి కాలం వరకు బ్రాహ్మణులెవరూ అయ్యప్ప గుడికి వెళ్లే వారు కాదు. అది ‘పులయ’ దేవాలయమని అనేవారు. పులయ అంటే హిందువుల్లో తక్కువ స్థాయి గలవారు అని అర్థం. అందుకే ఆలయ ప్రవేశానికి కఠిన నియమాలు రూపొందించారు. పొగ, మద్యపానం, తాంబూలం, శృంగారం వంటి వాటికి దూరంగా వుండాలన్న బౌద్ధ నియమాల్ని అయ్యప్ప భక్తులు కొనసాగిస్తున్నారు. ఈ నియమాలు ఏ హిందూ ఆలయ ప్రవేశానికీ లేవు. విష్ణుమూర్తి మోహినిగా వున్నప్పుడు శివుడు ప్రేమలో పడ్డాడని ఫలితంగా ఈ హరిహర పుత్రుడు పుట్టాడని జానపద కథలున్నాయి. ఆ కథల ఆధారంగా కొందరు కావ్యాలు రాశారు.

ఏమైనా ఇవన్నీ క్రీ.శ. 12001500 మధ్య కాలంలో పండలం రాజవంశీకుల కాలంలో జరిగిన సంగతులు. హిందూ పురాణాలన్నీ అంతకు ముందే రాయబడ్డాయి. గనక, ఈ అయ్యప్ప, ఈ వేంకటేశ్వరుడు (వెనకటి ఈశ్వరుడు తిరుపతి) ల సంగతులు అందులో కనబడవు. కొబ్బరి, బియ్యంతో ఇరుముడి తయారు చేసి మైళ్లకు మైళ్లు నెత్తి మీద మోస్తూ వెళ్లడం, నల్ల గుడ్డలు ధరించడం, దైనందిన జీవితంలో కఠిన నియమాలు పాటించడం వగైరాలన్నీ ఇతర ఏ హిందూ దేవాలయంలోనూ లేవు. కేవలం తక్కువ స్థాయి హిందువుల కోసం ఆధిపత్య వర్గాలు ఇవన్నీ ఇక్కడ ఏర్పరిచి వుండొచ్చు. ఇక మహిళలు ప్రవేశం గురించి ఇటీవల పెద్ద ఎత్తున అల్లర్లు, ఆందోళనలు, రాజకీయాలు నడుస్తున్నాయి. అది వేరే విషయం. మనుషులంతా ఒక్కటేనన్నాడు బుద్ధుడు. అదే భావన దీక్ష తీసుకున్న అయ్యప్ప భక్తుల్లో తాత్కాలికంగా చూస్తాం. ‘స్వామి శరణం అంటే స్వామి శరణం’ అని సంబోధించుకుంటారు. పలకరించుకుంటారు. ఉద్యోగ హోదాలు గాని, ఆర్థిక స్తోమత గాని, కుల పట్టింపులు గాని అప్పుడు వారిలో కనిపించవు.

అందరూ ఆ అయ్యప్పలే (దేవుళ్లే) అని అర్థం. కులాలు, జాతులు, వర్గాలు, వర్ణాలు అంతటితో సమసిపోతున్నాయా? అంటే లేదు. దీక్ష పూర్తి కాగానే షరా మామూలే. వారిలోని జాడ్యాలు అలాగే కొనసాగుతాయి. అందరం మనుషులమేనన్న విశాల భావనలోకి మాత్రం రారు. శబరిమలలో తాత్కాలికంగా పాటించే ‘సమానత్వ భావన’ బౌద్ధం నుండి తీసుకున్నదే. కీ.శే. ఉత్తరడోమ్ తిరునల్ మార్తాండ వర్మ ట్రావెల్ కోర్ రాచ కుటుంబీకుడు, 1942లో శబరిమలను తీసిన ఛాయా చిత్రం నెట్‌లో వుంది. అందులో దట్టమైన చెట్ల మధ్య చిన్న గుడి కనిపిస్తుంది.

ధర్మం శరణం వంటి పదాలు బౌద్ధంలో అతి ముఖ్యమైన పదాలు. వాటిని అయ్యప్ప భక్తులు తమ దేవుడికి ఆపాదించుకున్నారు. బౌద్ధ బిక్షుకులు బుద్ధుడి ‘సష్ట’ అని పిలుచుకునే వారు. అదే పేరుతో అయ్యప్పను భక్తులు పిలుచుకుంటున్నారు. హజ్, వాటికన్ సిటీ, తిరుపతి (వెనకటి ఈశ్వరుడు) వేంకటేశ్వరుడు, శబరిమల ఎక్కువ మంది యాత్రికుల్ని ఆకర్షిస్తూ వుండొచ్చు. అందుకే అవన్నీ గొప్ప వ్యాపార కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. పరీక్షలో కాపీ కొట్టి స్టేట్ రాంకర్‌గా నిలబడితే నిలబడొచ్చుగాక, ఆ అభ్యర్థిది నిజమైన నైతిక విజయమని అనలేం కదా? బుద్ధుడు చారిత్రక పురుషుడు. అయ్యప్ప కల్పించుకున్న దేవుడు. వాస్తవాన్ని మట్టుబెట్టి భ్రమల్ని ఊరేగించుకోవడమంటే ఇదే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్, ఏడుగురు మహిళా అడ్వొకేట్‌లు కలిసి కోర్టులో కేసు వేశారు. బుద్ధుడి శరణత్రయం (బుద్ధం ధర్మం సంఘం) ఆధారంగా శబరిమల ధర్మశష్ట, ప్రతిష్ఠ అనబడే అయ్యప్ప దేవాలయంలో ‘స్వామియే శరణం’ పేరుతో పూజలు సాగుతున్నాయనీ అది ఒకప్పటి బుద్ధుడి ప్రార్థనా మందిరమని ఆధారాలతో వారు కోర్టుకు తెలియజేశారు.

అయ్యప్ప మహిమల గూర్చి వందల సంవత్సరాలు కీర్తించుకున్న తర్వాత, ఇరుముడులు మోస్తూ కోట్ల మంది శబరిమలను సందర్శించుకున్న తర్వాత ఒక నిజం బయటపడింది. మకర జ్యోతి మానవ కల్పితమే తప్ప, దేవుడి మహిమ కాదని ఆ దేవస్థానం బోర్డు అధ్యక్షుడే స్వయంగా కోర్టులో ఒప్పుకున్నాడు. అంటే, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల ఏళ్ల నుండి భక్తులంతా మోసపోయినట్టే కదా? తమ తమ వ్యాపారాలు సాగించుకోవడానికి దేవుడి మహిమను వాడుకొని, జనాన్ని అజ్ఞానంలో ఉంచినట్టే కదా? హేతువాదుల, సైన్సు కార్యకర్తల ప్రమేయంతోనే ఇలాంటి నిజాలు వెలుగు చూస్తున్నాయి. వందల ఏళ్ల సంస్కృతి, సంప్రదాయాల గూర్చి గొప్పలు చెప్పుకునే వారు ఆ వందల ఏళ్ల కంటే ముందు ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి? మనోభావాలు దెబ్బ తింటున్నాయనే మత దేశ భక్తులు ముందు తమ కూట్లో రాయి తీసుకోవడం మేలు. ఏట్లో రాయి తీయ గలిగే టెక్నాలజీ ఎలాగూ వారి దగ్గర వుండదు.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News