Wednesday, December 25, 2024

షర్మిల పార్టీ రిజిస్టర్ కాలేదు

- Advertisement -
- Advertisement -

YSR Telangana party did not register:CEC

ఇతర పేర్లు ప్రతిపాదించాలని సూచించాం
అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు పరిశీలనలో ఉంది
స.హ.దరఖాస్తుకు భారత ఎన్నికల కమిషన్ స్పష్టం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైయస్సార్ తెలంగాణ పార్టీని రిజస్ట్రేషన్ చేయలేదని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం మేరకు షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్‌ను నిలుపుదల చేసినట్లు వెల్లడించింది. అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారానికి భారత ఎన్నికల సంఘం ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చినట్లు ఆ పార్టీ ఎపి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ మీడియాకు తెలిపారు. వైయస్ షర్మిల పార్టీని రిజిష్టర్ చేయలేదని, మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని షర్మిలకు లేఖ కూడా రాసినట్లు ఎన్నికల సంఘం తెలిపిందని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు తమ పార్టీ పేరును పోలి ఉందంటూ, ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ వైయస్ షర్మిల స్థాపించతలపెట్టిన వైయస్సార్ తెలంగాణ పార్టీ కూడా తమ పార్టీ పేరును పోలి ఉందంటూ అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతూ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేసినట్లు వెల్లడించింది. వైయస్ షర్మిలకు మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని ఈ నెల 3వ తేదీన లేఖ రాసినట్లు ఎన్నికల సంఘం మహబూబ్ భాషాకు వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపింది. దీంతో వైయస్ షర్మిల అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇప్పటికే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల కార్యక్రమాలను సైతం మొదలుపెట్టిరు. కాగా, భారత ఎన్నికల సంఘం పంపిన లేఖతో వైఎస్ షర్మిల అభిమానులు నిరాశకు గురవుతున్నారు. షర్మిలకు వైయస్సార్ పేరుతోనే పార్టీ కావాలంటే మహబూబ్ బాషాతో రాజీ కావడం తప్ప ఇతర మార్గం కనిపించడం లేదు. లేకపోతే వైఎస్‌ఆర్ పేరు లేకుండా వేరే పేరు పెట్టుకోవడం ఆమెకు ప్రత్యామ్నాయంగా మిగిలింది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ పేరుతో భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మహబూబ్ బాషా, అబ్దుల్ సత్తార్‌లు వెల్లడించారు. నిజమైన వైఎస్సార్ అభిమానులు పార్టీ అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.

నాడు వైఎస్సార్‌సిపి విషయంలోనూ…

దీనిపైన న్యాయపోరాటం చేయటం లేదా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారితో రాజీపడి.. గతంలో వైఎస్సార్‌సిపి ప్రారంభంలో అమలు చేసిన ఫార్ములా అమలు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి షర్మిల తన తండ్రి పేరుతోనే ఆ పార్టీ పేరు కొనసాగించేందుకే మొగ్గుచూపటం ఖాయం. దీంతో మరి ఇప్పుడు ఆ పార్టీ పేరు పైన మొదలైన అభ్యంతరాలు.. ఎన్నికల సంఘం లేఖ పైన ఏ రకంగా స్పందిస్తారు? ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News