Tuesday, December 24, 2024

ఎరువు బరువు దించండి

- Advertisement -
- Advertisement -

కోట్లాది రైతుల తరఫున వేడుకుంటున్నా

మూడు నెలల్లో ధరలు 50-100% పెంచారు

ఎరువులపై దశాబ్దాల రాయితీలను ఎత్తేస్తున్నారు వ్యవసాయ
రంగాన్ని కుదేలు చేసేలా కేంద్రం విధానాలు రైతుల నడ్డి విరిచేలా
నిర్ణయాలు అన్నదాత ఆదాయం రెట్టింపేమోగానీ, పంట పెట్టుబడి
రెట్టింపయ్యింది పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సంక్షోభంలోకి
సాగు రంగం ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించకుండా
జాప్యం పంపుసెట్లకు మీటర్లు పెట్టాలనడం దారుణం
ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖాస్త్రం

modi govt increased urea rate

మన తెలంగాణ/హైదరాబాద్:  ఎరువుల ధరలను పెంచాలన్న కేంద్రం నిర్ణయంపై సిఎం కెసిఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రధానికి ఆయన ఒక లేఖ రాశారు. ఈ లేఖలో రైతుల పట్ల కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తిని వెలిబుచ్చారు. 2022 నాటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో మీరు (మోడీ) ప్రకటించారన్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.ఈ నేపథ్యంలో కోట్లాది మంది రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని….. ఎరువుల ధరలను పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మోడీకి సూచించారు.కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కొన్ని అంశాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నదనే విషయాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నానని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మీ విధానానికి వ్యతిరేకంగా రైతుల వ్యవసాయ పెట్టుబడి ధరలు మాత్రం రెట్టింపు కావడం అందరినీ నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్నదని వ్యాఖ్యానించారు..

ఈ ఐదేండ్లలో రైతుల ఆదాయం క్షీణించడంతో యావత్ రైతాంగంలో ఆందోళనకర పరిస్థితులకు దారితీసిందని ఆ లేఖలో కెసిఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆరేండ్లుగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరించడమే గాకుండా యూరియా, డిఎపి తదితర ఎరువుల వాడకాన్ని తగ్గించాలంటూ ప్రచారం చేయాలని రాష్ట్రాలను పురిగొల్పుతున్నదన్నారు. రైతులు ఎక్కువగా వినియోగించే 0 ఎరువుల ధరలను 50శాతానికి, పొటాషియం ఎరువు ధరను 100శాతానికి గత 90 రోజుల్లోనే పెంచడం శోచనీయమన్నారు. ఎరువుల ముడిసరుకుల మీద పెరుగుతున్న దిగుమతి సుంకాన్ని భరిస్తూ ధరలను రైతులకు అందుబాటులో ఉంచాల్సిన కేంద్రం…

ఆ భారాన్ని రైతుల నెత్తిమీదనే రుద్దడం సమంజసం కాదన్నారు. రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణ రోజురోజుకూ పురోగమిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలో డీజిల్, పెట్రోల్ వాడకం కూడా పెరుగుతున్న సంగతి మీకు తెలిసిందేనని అన్నారు. క్రూడాయిల్ ధరలు పెరగకున్నా… కేంద్రం విధిస్తున్న అసంబద్ధ సెస్ చార్జి కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి రైతులకు అదనపు బాధను కలిగిస్తున్నదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ఎరువుల ధరల పెంపు..ఈ రెండు అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల మూలంగా రైతాంగం తీవ్ర క్షోభను అనుభవిస్తున్నదని వివరించారు.దేశంలో ఏడు దశాబ్ధాలుగా కేంద్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మార్చివేయడం వలన రైతుల్లో తీవ్ర ఆందోళన కలుగుతున్నదన్నారు.

సాగు ఖర్చులో కొంతమేరకైనా ప్రభుత్వం భరిస్తూ రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించవచ్చని భావించి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యకలాపాలకు అనుసంధానించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. కాని దీనిపై ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అందించే విషయంలో ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ చేసిన పలు కీలక సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించడం రైతాంగాన్ని పక్కదారి పట్టించడమేనని వ్యాఖ్యానించారు. విశ్వనాథన్ కమిషన్ చేసిన కీలకమైన మూడు సిఫారసులను పక్కకు పెట్టడం ద్వారా మద్ధతు ధర విషయంలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీరని నష్టం చేస్తున్నదన్నారు. “వ్యవసాయ సాగులో చోటుచేసుకునే మొత్తం ఉత్పత్తి వ్యయంలో 50శాతం మద్ధతు ధరకు జోడించాలి” అనే సిఫారసుతో పాటు ”భూమి లీజు ధరలను కూడా ఉత్పత్తి వ్యయంలో కలుపాలి” అనే సిఫారసును, “సాగులో రైతు వినియోగించే ట్రాక్టర్లు, యంత్రాలు తదితర స్వంత వ్యవసాయ సాగు ఆస్తులు తదితరాల వ్యయాన్ని ఉత్పత్తి వ్యయానికి జోడించాలి” అనే మరో కీలక సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగా పక్కకుపెట్టిందన్నారు. తద్వారా స్వామినాథన్ సిఫారసుల ప్రకారం 150 శాతం మద్ధతు ధరను అమలుపరుస్తున్నామని కేంద్రం ప్రకటించుకోవడం దేశ రైతాంగాన్ని తప్పుదారి పట్టించడమే అవుతుందన్నారు.

మరోపక్క మద్ధతు ధర ప్రకటించినట్టే ప్రకటించి చేతులు దులుపుకుంటున్నదన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనకుండా కొంత శాతాన్నే కొంటున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. రైతాంగానికి తన పంటకి మద్ధతు ధర లభిస్తుందనే భరోసాను కలిగించడంలో కేంద్రానికి సరైన వ్యవస్థ లేనే లేదన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ నాణ్యత పేరుతో కనీస మద్ధతు ధర పొందడానికి రైతులు నిరాకరించబడుతున్నారన్నారు. వారు పండించిన పంటను మార్కెట్లో తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితుల్లోకి దేశ రైతులు నెట్టివేయబడుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో వ్యవసాయాన్ని లాభసాటి వ్యవహారం కాకుండా చేస్తున్నారని కెసిఆర్ ఆరోపించారు. ఎరువుల ధరలు పెంచడం ద్వారా, డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనం ధరలను పెంచడం ద్వారా, కనీస మద్ధతు ధరను నిర్ధారించడంలో తప్పుడు విధానాలు అనుసరించడం ద్వారా వ్యవసాయ సాగు ఖర్చులను పెంచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం తన వాగ్ధానాన్ని తానే ఉల్లంఘిస్తున్నదనే విషయాన్ని తెలియజేస్తున్నానని ఆ లేఖలో కెసిఆర్ అన్నారు.

ఈ తప్పుడు విధానాలకు తోడుగా వ్యవసాయ రంగంలో విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగించడమనే నిర్ణయం, కష్టజీవులైన దేశ రైతాంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఎరువుల ధరలను పెంచకుండా చూడాలని, రైతుల నెత్తిమీద భారం మోపకుండా అధిక ధరలను కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాసటగా నిలువాల్సిన అవసరముందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వారికి దన్నుగా ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా పెట్టుబడి సాయం కింద రైతుబంధు కింద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్లలో రూ. 50వేల కోట్లను జమ చేశామన్నారు. మరోవైపు కరోనా వంటి వైరస్‌తో అన్ని రంగాలు కుదేలు అవుతున్న నేపథ్యంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై కేంద్రం కన్నెర్ర చేయవద్దని….వారిని ఆగం చేయవద్దని ప్రధానికి రాసిన లేఖలో సిఎం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News