లండన్: ఆస్ట్రా జెనెకా వ్యాక్స్‌జెవారియా వ్యాక్సిన్‌ను మూడవ బూస్టర్ డోసుగా వేసుకున్న వారిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొనే యాంటీబాడీలు పెంపొందాయని అధ్యయనంలో తేలినట్లు బ్రిటిష్ స్వీడిష్ బయోఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా గురువారం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో కోవిషీల్డ్ పేరిట తయారుచేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసుగా వేసుకున్నవారిలో బెటా, డెల్టా, అల్షా, గామా సార్స్ కోవి–2 వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతోందని ప్రస్తుతం జరుగుతున్న అధ్యయనంలో తేలినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీలు శరీరంలో బూస్టర్ డోస్ తర్వాత బాగా పెరిగినట్లు మరో అధ్యయనంలో వెల్లడైనట్లు కంపెనీ తెలిపింది. వ్యాక్స్‌జెవ్‌రియా లేదా ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్‌ను గతంలో వేసుకున్న వారిలో ఈ ఫలితాలు కనిపించాయని పేర్కొంది. మూడవ బూస్టర్ డోస్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఈ అధయనాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంస్థలకు అందచేయనున్నట్లు కంపెనీ తెలిపింది.