జెనీవా : రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు సగం ఐరోపాకు కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వరకు మొత్తం ఒమిక్రాన్ వ్యాపిస్తుందన్నారు. 2022 తొలి వారంలో 70 లక్షల మందికి కొవిడ్ సోకడాన్ని ఆధారంగా చేసుకుని ఈ అంచనాలను లెక్కగట్టారు. ఐరోపా ఖండంలో ఇన్‌ఫెక్షన్ సోకిన వారి సంఖ్య రెండు వారాల్లో రెట్టింపైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ హన్స్ క్లూగ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కనీసం 50 శాతం మంది ప్రజలు అత్యధికంగా ఎనిమిది వారాల్లోపు ఒమిక్రాన్ బారినపడే అవకాశం ఉందని అమెరికా లోని సియాటెల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మ్యాట్రిక్స్ అండ్ ఇవల్యూషన్ అంచనా వేసినట్టు వెల్లడించారు. ఐరోపా, మధ్య ఆసియా దేశాలపై ఒమిక్రాన్ ఒత్తిడి కొనసాగుతోందని డాక్టర్ హన్స్ క్లూగ్ పేర్కొన్నారు. ప్రపంచం లోనే అత్యధిక మరణాల రేటు నమోదవుతున్న దేశాల్లో ఐరోపా లోని పోలాండ్ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కనీసం 40 శాతం మందికి ఎటువంటి వ్యాక్సిన్లు అందలేదు.