అఖిలేష్ పాలనపై విమర్శల వర్షం
గోరఖ్‌పూర్(యుపి): ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఒక దళితుని ఇంట భోజనం చేశారు. గోరఖ్‌పూర్‌లోని ఒక దళిత కుటుంబం నివసిస్తున్న ఇంటిని సందర్శించిన యోగి వారితో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ సమాజ్‌వాది పార్టీ పాలనలో దళితుల దోపిడీ జరిగిందే తప్ప సామాజిక న్యాయం జరగలేదని, కాని బిజెపి ప్రభుత్వం మాత్రం ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని అన్నారు.మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అమృత్‌లాల్ భార్తీ అనే దళితుని ఇంట భోజనం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ అఖిలేష్ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో పిఎం ఆవాస్ యోజన కింద కేవలం 18,000 ఇళ్లు మాత్రమే ప్రజలకు ఇవ్వగా తమ ప్రభుత్వం ఇదే పథకం కింద 45 లక్షల ఇళ్లను పేదలకు అందచేసిందని చెప్పారు. వారసత్వ రాజకీయాలు ఉన్న టోల సమాజంలోని ఏ వర్గానికి న్యాయం దక్కదని ఆయన అన్నారు. దళితులు, పేదల హక్కులను ఎస్‌పి ప్రభుత్వం దోపిడీ చేసిందని ఆయన ఆరోపించారు.