మన తెలంగాణ\హైదరాబాద్: ప్రముఖ పురాణ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యమయ్యారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జ్యోతిష్య శాస్త్రంపై విశేష అవగాహన కలిగి ఉన్న వ్యక్తిగా చంద్రశేఖర శాస్త్రి సుపరిచితులు. వేదాలు, పురాణాలను భాషా శాస్త్రబద్ధంగా చెబుతూ ఎందరో ఆస్తికులకు ధర్మ మార్గాన్ని చూసిన వ్యక్తిగా ఆయన మంచి గుర్తింపు పొందారు.
వేదాలు, శ్రౌతస్మార్త, వ్యాకరణ తర్క వేదాస్త సాహిత్యాలపై ఈయన చిన్నతనంలోనే అధ్యాయనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితునిగా కూడా ఆయన వ్యవహరించారు. అభినవ వ్యాసునిగా పేర్గాంచిన ఆయన ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా హస్పనాబాద్‌లో 1925 ఆగస్టు 22న జన్మించారు. పంచాంగ గణికంలో సిద్ధహస్తులుగా ఆయన్ను పలువురు పండితులు కీర్తిస్తుంటారు. వేదాలు, ఆష్టాదశ పురాణాలపై ఆయన పలు గ్రాంధాలు రాశారు. భారతము ధర్మసూక్ష్మదర్శనము, కృష్ణలహరి (సేచ్చాంధ్రానువాదము), రామాయణ రహస్య దర్శిని, రామాయణ రహస్యములు, భాగవత తత్వము అనే గ్రాంథాలు ఈయన రచనలు. 2005లో శ్రీ రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ పురాణ వఛాస్పతి అవార్డుతో చంద్రశేఖర శాస్త్రిని సత్కరించారు.