Saturday, December 21, 2024

టెస్టు కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

Virat Kohli steps down as Test Captain

 సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన కోహ్లీ
 జట్టు కోసం 120శాతం కష్టపడ్డానని వ్యాఖ్య
 అభిమానుల నుంచి ప్రశంసలు అంటుకుంటున్న మాజీ సారధి

‘2014లో నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడంతో నువ్వు కెప్టెన్ అయ్యావని చెప్పిన రోజు. ధోని, నేను, నువ్వు కూర్చుని మాట్లాడుకోవడం, గడ్డం ఎంత త్వరగా తెల్లగా అవుతుందనే విషయం మీద ధోని వేసిన జోకులు నాకు ఇంకా గుర్తున్నాయి. మనం ఆరోజు చాలా నవ్వుకున్నాం. అప్పటి నుంచి నీ గడ్డం తెల్లబడటం కంటే చాలా మార్పులు నేను చూశాను. నువ్వు ఎదగడం కాదు. ఎంతో ఎత్తుకు ఎదిగావు. బయట, లోపల కూడా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నువ్వు ఎదిగిన తీరు, నీ నాయకత్వంలో జట్టు సాధించిన విజయాలకు నేనెంతో గర్వపడుతున్నాను.’ -అనుష్కశర్మ

ముంబై: భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఏడేళ్లుగా తాను టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించానని. ప్రస్తుతం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. నేను టీమిండియాకు సారధ్యం వహించన ఈ ఏడేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, తనకు అవకాశం ఇచ్చిన బిసిసిఐకి ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా జట్టుకోసం సర్వశక్తులు ఒడిశానని, ఎంతో నిజాయతీగా వ్యవహరించి జట్టుకు చాలా విజయాలు సాధించానని విరాట్ తెలిపాడు. ప్రతి దానికి ఏదో ఒక దశలో ముగింపు అనేది ఉంటుందని. తన విషయంలోనూ అదే జరిగిందన్నాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రస్థానం ఇంతటితో ముగిసిందని అనుకుంటున్నట్లు కోహ్లీ తెలిపాడు. తన ప్రస్థానంలో ఒక్కసారి కూడా ప్రయత్నలోపం కానీ, నమ్మకం కోల్పోవడం కానీ జరగలేదన్నాడు. జట్టు కోసం ప్రతి సందర్భంలో 120 శాతం కష్టపడ్డానని.

తాను ఏదైనా చేయలేకపోయుంటే, అది చేయదగ్గ పని కాదనే అర్థమన్నాడు. టెస్టు కెప్టెన్‌గా తాను వ్యవహరించిన విధానంపై తనకు ఎంతో స్పష్టత ఉందన్నాడు. అటు తనలో కెప్టెన్‌ను గుర్తించి.. తనపై నమ్మకం ఉంచిన ధోనీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. రవిశాస్త్రితో పాటు టీమ్ మొత్తానికి థ్యాంక్స్ చెప్పాడు. కాగా భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనపై బిసిసిఐ స్పందించింది. కోహ్లీకి ధన్యవాదాలు తెలియజేసింది. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లావని 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచావని బిసిసిఐ కొనియాడింది.
అత్యధిక విజయాలు
కాగా 2014 నుంచి 2022 వరకు 68 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ జట్టుకు 40 విజయాలు అందించగా. 17 మ్యాచ్‌లలో జట్టు ఓటమి పాలయ్యింది. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 58.82 గెలుపు శాతంతో భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నీరాజనాలు అందుకున్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఓ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రలియాలో టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు.. ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో అధిక్యంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క ఇండియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఆసియా ఖండం అవతల..
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు విదేశీ మైదానాల్లో టెస్టు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2018లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, ఆడిలైడ్‌లో, ఇంగ్లండ్‌లోని నాటింగ్‌లో హామ్‌లో, సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచ్‌లను గెలిచాడు. అంతేకాకుండా సేన దేశాలుగా పిలువబడే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై అత్యధిక టెస్టు విజయాలు సాధించిన ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాలోని ప్రతిష్మాత్మక సెంచూరియన్ గ్రౌండ్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఒకే ఒక్క ఆసియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ ఘనత ప్రస్తుత సౌతాఫ్రిక పర్యటనలోనే అందుకున్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయగా మూడో కెప్టెన్‌గా నిలిచాడు.
ఎక్కువ కాలం అగ్రస్థానంలో..
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు అత్యధికంగా 42 నెలలపాటు టెస్ట్ ఫార్మాట్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. స్వదేశంలో టెస్టుల్లో అత్యధికంగా 24 విజయాలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అంతేకాకుండా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా స్వదేశంలో ఒక్క సారి కూడా టెస్టు సిరీస్ కోల్పోలేదు.

కెప్టెన్‌గా అత్యధిక రన్స్
అలాగే భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. టె స్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా 54 సగటుతో కోహ్లీ 5864 పరుగులు చేశాడు. ఇందులో 20 సెంచరీలు ఉన్నాయి. అదే సాధారణ ఆటగాడిగా 41 సగటుతో 2098 పరుగులు మాత్రమే చేశాడు. 7 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వన్డే సిరీస్‌లు గెలిచాడు. న్యూజిలాండ్‌లో అయితే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 5-0తో వైట్ వాష్ చేయడం గమనార్హం. ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలతోపాటు సగటు కలిగి ఉన్న ఆసియా కెప్టెన్ కూడా కోహ్లీనే.

Virat Kohli steps down as Test Captain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News