హోబర్ట్: సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. యాషెస్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. హోబర్ట్ వేదికగా జరిగిన చివరి టెస్టులో 271 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 124 పరుగులకే ఆసీస్ బౌలర్లు ఆలౌట్ చేశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది. ఇంగ్లండ్ జట్టులో క్రాలీ (36) అత్యధిక స్కోరు చేశాడంటే మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎంత ఘోరంగా ఆడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమిన్స్, బోలాండ్, గ్రీన్ తలో మూడు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వరుసగా తొలి మూడు టెస్టుల్లో గెలిచి ఆస్ట్రేలియా ఎప్పుడో సిరీస్‌ను గెలుచుకుంది. నాలుగో టెస్టు డ్రాగా ముగియగా.. ఆఖరిదైన ఐదో టెస్టులో ఆసీస్ నెగ్గింది. కాగా కెప్టెన్‌గా కమిన్స్‌కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం.
AUS win Ashes Series with 4-0 against ENG