హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి పనులపై సోమవారం ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిలోనూ ఉపాధి హామీ నిధుల వినియోగంలోనూ మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. తాజాగా పంచాయతీ భవనాలు, కాలువల పూడికతీత వంటి పనులకు కూడా ఉపాధి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు చెప్పారు. అంతేగాక ఈ మార్చిలోగా సాధ్యమైనంత ఎక్కువ ఉపాధి పనులు చేయాలని అదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన గ్రామ పంచాయతీలు, ఎస్సీ రిజర్వు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై సీఎం ఆదేశానుసారం నడుచుకుంటానని అన్నారు.
ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్వహణ వంటి విషయాల్లో అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు. కొత్త రోడ్లు, మురుగునీటి కాలువల పనులు కూడా త్వరలోనే వస్తాయని మంత్రి చెప్పారు.మరోవైపు గ్రామ కార్యదర్శులకు జియో ట్యాగింగ్ పెట్టామని, జిల్లాలో కార్యదర్శులు, అధికారులు మరికొంత అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అదేశించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించిందన్నారు. ఇది అరుదైన ఘనత, సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా సాధ్యమైందని, దీన్ని నిలబెట్టుకోవడం మన విధి అని చెప్పారు. పాఠశాలలో నర్సరీలను ఏర్పాటు చేసి, ప్లాంటేషన్ పెడితే, గ్రామ పంచాయతీలకు భారం తగ్గుతుందని మంత్రి సూచించారు. డంపింగ్ యార్డులలో చెత్త ద్వారా తీసిన ఎరువుల అమ్మకంతో రాష్ట్రంలో పంచాయతీలు రూ.300కోట్లు అర్జించాయని మంత్రి వివరించారు.
Errabelli Review on Panchayat Raj & Rural developments