Friday, November 22, 2024

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20 న

- Advertisement -
- Advertisement -

Punjab Assembly elections on February 20

గురు రవిదాస్ జయంతి దృష్ట్యా తేదీ మార్పు

న్యూఢిల్లీ : పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14 ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్‌ను ఆరు రోజుల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 20 న నిర్వహించడానికి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు గురు రవిదాస్ జయంతి వేడుకలు ఉండడంతో పోలింగ్ తేదీని మార్చాలని అధికార కాంగ్రెస్ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరగాల్సి ఉండగా, ఫిబ్రవరి 16 న ఉత్తరప్రదేశ్ లోని బెనారస్‌లో గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఆమేరకు సంబంధిత కార్యక్రమాలు ముందే ప్రారంభమౌతాయి.

పైగా జయంతి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి తరలి వెళ్లనున్నారు. దీంతో వారంతా ఓటు వేసే అవకాశం కోల్పోతారని పార్టీలు ఎన్నికల సంఘానికి విన్నవించాయి. దీంతో ఫిబ్రవరి 20 కి మార్పు చేస్తూ కొత్త ఇసి ప్రకటించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 25న విడుదల అవుతుంది. నామినేషన్లకు తుది గడువు ఫిబ్రవరి 1. నామినేషన్ల పరిశీలనకు తుది గడువు ఫిబ్రవరి 2. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు ఫిబ్రవరి 4. మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇదే విధంగా ఎన్నికలు జరిగే మిగతా రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ల్లో కూడా మార్చి 10 నే ఓట్లు లెక్కిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News