కోట్లాధిపతుల సంఖ్య 39 శాతం నుంచి 142 కు పెరుగుదల
142 కోట్లాధిపతుల ఉమ్మడి సంపద రూ. 53 లక్షల కోట్లు
కేవలం 10 మందిపై ఒకశాతం అదనపు పన్ను విధించినా చాలు
17.7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు లభ్యమవుతాయి
ఆయుష్మాన్ భారత్‌కు ఏడేళ్లు నిధులు అందుతాయి
ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ వార్షిక సర్వే వెల్లడి
న్యూఢిల్లీ : భారతీయ కోటీశ్వరులు కరోనా మహమ్మారి ప్రళయంలో కూడా తమ అదృష్ట సంపదను రెట్టింపు కన్నా ఎక్కువ స్థాయికి చేర్చుకోగలిగారని అధ్యయనంలో వెల్లడి కావడం విస్మయం కలుగుతోంది. వీరందరి ఉమ్మడి సంపద తో దేశంలో ఎన్నో సుదీర్ఘ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ అదృష్ట వంతుల సంఖ్య 39 శాతం నుంచి 142 కు చేరినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో పదిమంది కోట్లాధిపతులు దేశం లో 25 ఏళ్ల వరకు పిల్లల పాఠశాల, ఉన్నత చదువులకు కావలసినంత నిధులు అందించే సామర్ధం ఉన్నవారని కొత్త అధ్యయనం వెల్లడించింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ (డబ్లుఇఎఫ్) ఆన్‌లైన్ దావోస్ అజెండా సదస్సు ప్రారంభం రోజున ఆర్థిక అసమానతల వార్షిక నివేదిక విడుదల కావడం గమనార్హం. ఆక్స్‌ఫామ్ ఇండియా ఈ నివేదికను విడుదల చేసింది. ఈ శ్రీమంతుల్లో పదిశాతం మందిపై అదనంగా ఒక శాతం పన్ను విధించినా ఆ మొత్తంతో దేశంలో దాదాపు 17.7 లక్షల అదనపు ఆక్సిజన్ సిలిండర్లు సమకూరుతాయని, అలాగే 98 శాతం కోట్లాధిపతుల కుటుంబాలపై అదే సంపద పన్ను విధిస్తే ప్రపంచం లోనే భారీ ఆరోగ్యబీమా పథనంగా ప్రసిద్ధి పొందిన ఆయుష్మాన్ భారత్‌కు ఏడేళ్లకు మించి ఆర్థిక సహాయం లభిస్తుందని నివేదిక వివరించింది. కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజన్ సిలిండర్లకు పెద్ద ఎత్తున గిరాకీ ఏర్పడింది. గత ఏడాది సెకండ్ వేవ్‌లో బీమా చెల్లింపులు ఎక్కువగానే ఉన్నాయి.
ఆర్థిక అసమానతలు….
142 కోట్లాధిపతుల ఉమ్మడి సంపద రూ. 53 లక్షల కోట్లు
భారతీయ కోట్లాధిపతులు 142 మంది తమస్వంత ఉమ్మడి సంపద రూ.53 లక్షల కోట్లకు (719 బిలియన్ డాలర్లు) మించి ఉందని, వారిలో 98 మంది సంపద, 40 శాతం దిగువన ఉన్న 55.5 కోట్ల పేద ప్రజల సంపదతో అంటే దాదాపు 49 లక్షల కోట్లతో ( 657 బిలియన్ డాలర్లు ) సమానంగా ఉందని ఆక్‌ఫామ్ నివేదిక వివరించింది. పదిమంది కోట్లాధిపతుల్లో ఒక్కొక్కరు రోజూ ఒక మిలియన్ డాలర్లు ఖర్చుచేసినా ప్రస్తుతం ఉన్న వారి సంపద తరిగిపోపడానికి కనీసం 84 ఏళ్లైనా పడుతుందని అంచనా తేలింది. బహుళ కోట్లాధిపతులు లేదా కోట్లాధిపతులపై వార్షిక సంపద పన్ను విధిస్తే ఏటా 78.3 బిలియన్ డాలర్ల వరకు సమకూరుతాయి.
అది ప్రభుత్వ వార్షిక ఆరోగ్య బడ్జెట్ ను 271 శాతం వరకు పెంచుకోడానికి వీలవుతుంది. సామాన్య కుటుంబాలు తమ జేబు నుంచి వైద్యానికి ఖర్చు చేయవలసిన పని ఉండదు. ఇంకా 30.5 బిలియన్ డాలర్లు మిగిలే ఉంటాయి. ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకోడానికి పన్ను విధానంలో ప్రగతిదాయక పద్థతులు అవలంబించాలని, శ్రీమంతుల వద్దనే సంపంద పేరుకు పోకుండా వ్యవస్థాపరమైన అంశాలను సమీక్షించాలని ఈ అధ్యయనం ప్రతిపాదించింది. ఈ విధంగా సమకూరిన ఆర్థిక వనరులను ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత కు మళ్లించాలని అసమానతలు తగ్గించడం విశ్వజనీన హక్కులుగా పరిగణించాలని సూచించింది. దీనివల్ల ఆయా రంగాలు ప్రైవేటీకరణ కాకుండా నిలబడగలుగుతాయని పేర్కొంది.