లక్నో : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము ఒంటరి గానే పోటీ చేస్తామని ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయమై మాట్లాడుతూ దీనిపై చర్చలు జరిపి సాయంత్రానికి ఏ విషయమూ వెల్లడిస్తామన్నారు. యూపిలో తాము ప్రత్యామ్నాయం అవుతామని చెప్పారు. ఎమ్‌ఎల్‌ఎ, మంత్రి అంటూ వచ్చిన ఆఫరర్లను తిరస్కరించానని పేర్కొన్నారు. సమాజ్‌వాది పార్టీ తమకు 100 సీట్లు ఇస్తామని ఆఫర్ చేసినా తాము వెళ్లబోమని తేల్చి చెప్పారు. ఎన్నికల తరువాత బీజెపి అధికారం లోకి రాకుండా అడ్డుకునేందుకు ఇతర పార్టీలకు సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. మాయావతితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించానని, కానీ అటువైపు నుంచి ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. గత ఐదేళ్లలో తాను ఎంతో కోల్పోయానని అన్నారు. హత్రాస్, ప్రయాగ్‌రాజ్ , ఉన్నావో వంటి ఘటనల్లో నిరసనలు తెలిపి జైలుకు కూడా వెళ్లి వచ్చానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలో చీలిక వల్ల బిజెపియే మళ్లీ అధికారం లోకి వస్తే అది ప్రతి ఒక్కరికీ నష్టమేనని స్పష్టం చేశారు. భీమ్ ఆర్మీకి కార్యకర్తలే బలమని ఆజాద్ పేర్కొన్నారు.