రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు నిబంధనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నాటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఎపి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈక్రమంలో గడచిన 24 గంటల్లో ఎపిలో 6,996 మందికి వైరస్ సోకగా నలుగురు మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 1,066 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 38,055 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.జిల్లాల వారిగా కేసులుచిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,534 కరోనా కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళం జిల్లాలో 573, అనంతపురం జిల్లాలో 462, ప్రకాశం జిల్లాలో 424 మందికి కొవిడ్ సోకింది.
ఇదిలావుండగా ఎపిలో ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రుల సిబ్బంది, ఆసుపత్రులు, మెడికల్ షాపులు, మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్), టెలికాం సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది, పెట్రోల్ బంకులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. చికిత్స పొందుతున్న రోగులు, గర్భవతులకు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వారికి మినహాయింపునిచ్చారు. అలాగే షాపింగ్ మాల్స్, దుకాణాల్లో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. నైట్ కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి, ఇండోర్ ప్రదేశాల్లో 100 మందికి మాత్రమే అనుమతిచ్చారు. సరకు రవాణా వాహనాలకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపునివ్వడం జరిగింది.