రాష్ట్ర పాలనాకేంద్రం బిఆర్‌కె భవన్‌లో కరోనా కలకలం
మహమ్మారి బారిన కీలక శాఖల్లోని అధికారులు, సిబ్బంది
పంచాయతీరాజ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులు, డిహెచ్ శ్రీనివాసరావుకు కరోనా
రాష్ట్రవ్యాప్తంగా 900మంది పోలీసు సిబ్బందిపై కొవిడ్ పంజా
ప్రముఖ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందినీ వదలని మహమ్మారి
క్వారంటైన్, హోం ఐసోలేషన్లలో వేలాది మంది బాధితులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు, పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, పలువురు ఐఏఎస్ అధికారులకు వైరస్ బారినపడ్డారు. అదేవిధంగా, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) కొవిడ్ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలోచేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. “స్వల్ప కొవిడ్ లక్షణాలు కనపడి, పరీక్ష ద్వారా నిర్ధారణ కావడంతో, ముందు జాగ్రత్తగా ఐసోలేషన్,తగిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నాను. ఏ విధమైన ఆందోళనలు,అపోహలు వద్దు… త్వరలో పూర్తి స్వస్థతతో మీ ముందుకు వస్తా.. అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి కోరుతున్నాను” అని డీహెచ్ పేర్కొన్నారు.
కొవిడ్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. సోమవారం వరకు గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ వైద్యవిద్యార్థులు, 38 మంది హౌజ్‌సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆరుగురు అధ్యాపక సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు. ఉస్మానియాలో 175 మంది వైద్యులు, వైద్యవిద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఉస్మానియా ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్, ఉస్మానియా డెంటల్ ఆసుపత్రిలో నలుగురు వైద్యులు కొవిడ్ బారిన పడ్డారు. అలాగే ఇఎన్‌టి ఆసుపత్రిలో 24 మంది వైద్యులు, సిబ్బందికి వైరస్ సోకింది. నిమ్స్‌లోనూ 70 మందికి పైగా వైద్యులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. అలాగే ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 66 మంది వైద్యసిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే నీలోఫర్‌లో 25 మందికి కొవిడ్ సోకినట్లు తెలిసింది. నాంపల్లి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ సేవల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందికి 7 రోజుల క్వారంటైన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వైద్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
సచివాలయంలో కొవిడ్ కలకలం
రాష్ట్ర సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బిఆర్‌కెఆర్ భవన్‌లో కొవిడ్ కలకలం కొనసాగుతోంది. పలువురు సీనియర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. విద్యాశాఖ, పంజాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీనివాసరాజుకు పాజిటివ్ నిర్ధరణ అయింది. అలాగే జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఆయన పేషీలో ముగ్గురు పిఎస్‌లతో సహా మరికొంత మంది సిబ్బంది వైరస్ బారినపడ్డారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పలువురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. బిఆర్‌కెర్ భవన్‌లో దాదాపు 25 మంది వరకు కొవిడ్ బారిన పడ్డట్లు సమాచారం. పేషీల్లోని సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఒకరిద్దరు అధికారులు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు కొందరు కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. వీరితో పాటు పోలీసు శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 900 మంది కరోనా బారిన పడి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.