హైదరాబాద్ : నగరంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చి ప్రజలను ఆసుపత్రుల బాట పట్టిస్తుంది. గత 15 రోజుల నుంచి రోజుకు 1200లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారంతా వ్యాధి నిర్దారణ చేసేందుకు స్దానిక ఆరోగ్య కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. జనం పెరగడంతో రెండు రోజుల నుంచి పరీక్షల కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. గంటల తరబడి క్యూలో నిలబడి ఆలస్యమైన పరీక్షలు చేస్తుకుంటున్నారు. బాధితుల సంఖ్య పెరగడంతో పలు ఆసుపత్రులో కరోనా కిట్ల కొరత ఏర్పడింది. దీంతో కొంతమంది ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయిస్తూ వ్యాధులను తెలుసుకుంటున్నారు. చలితీవ్రత ఒమిక్రాన్ విస్తరణతో వైద్యశాఖ టెస్టులు పెంచాలని సిబ్బందికి సూచనలు చేయడంతో రోజుకు 50మంది వరకు టెస్టులు చేస్తున్నారు. సంక్రాంతి పండగ తరువాత ఊహించని విధంగా జనాలు టెస్టుల కోసం వస్తున్నట్లు, విషజ్వరాలకు పేరుగాంచిన ఫీవర్ ఆసుపత్రికి రోజుకు 350మందికి పరీక్షలు చేస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో దగ్గు, జలుబు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు సీజనల్ వ్యాధులా , కరోనా వైరస్ అంటూ భయపడుతూ వ్యాధులు నిర్దారణ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉండి రోగులకు పలు రకాల సేవలందిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. నగరంలో 258 బస్తీదవఖానలతో పాటు, 98 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు వారాల పాటు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని వైద్యశాఖ పేర్కొనడంతో నగర ప్రజలు వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జనం పెరగడంతో వైద్యశాఖ ఉన్నతాధికారులకు సమస్యలు వివరించడంతో సరిపడ కిట్లు, సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్నారు. విందులు, వినోదాలు పరిమిత సంఖ్యలో చేయాలని, ఒకే దగ్గర గుంపులుగా ఉండి విందులు చేస్తే మహమ్మారి పంజా విసురుతుందని, ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు పాటించి, ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.