Friday, November 22, 2024

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ విజృంభణ

- Advertisement -
- Advertisement -

Covid boom in Telugu states

ఎపిలో 10,057, తెలంగాణలో 3,557 కొత్త కేసులు
వైరస్ కట్టడికి నేడు తెలంగాణ మంత్రుల సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకర రీతిలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీలో ఐదారు వేలుగా నమోదవుతున్న రోజువారీ కేసులు…బుధవారం ఏకంగా 10 వేలు దాటగా, తెలంగాణలో రెండు, రెండున్నర వేలుగా నమోదవుతున్న కేసులు 3,557లకు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,11,178 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,557 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,18,196కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,474 కేసులు నమోదయ్యాయి.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 321, రంగారెడ్డి జిల్లాలో 275 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,065కు చేరింది. తాజాగా కరోనా నుంచి 1,773 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,89,878 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.06 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 11,949 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా మారింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,713 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా… 10,057 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో 8 మంది మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,827, చిత్తూరు జిల్లాలో 1,822, గుంటూరు జిల్లాలో 943, తూర్పుగోదావరి జిల్లాలో 919, అనంతపురం జిల్లాలో 861, ప్రకాశం జిల్లాలో 716, కడప జిల్లాలో 482 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కొవిడ్ నుంచి మరో 1,222 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,935 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఇదిలావుండగా, కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణా చర్యలు కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు చేపడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో కొవిడ్ నియంత్రణపై గురువారం మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రులు సమీక్షించనున్నారు. వైద్య-ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్ సోమేష్‌కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొంటారు. జిల్లాల వారీగా కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై సమీక్షించడంతో పాటు నియంత్రణా చర్యలపై చర్చిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News