కదంతొక్కిన బవుమా, డుసెన్, తొలి వన్డేలో భారత్ ఓటమి
పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌కు ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 31 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది.
ధావన్, కోహ్లి మెరిసినా..
క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ శిఖర్ మెరుగైన ఆరంభాన్ని అందించాడు. ఆరంభం నుంచే ధావన్ దూకుడుగా ఆడాడు. అయితే కెప్టెన్ రాహుల్ మాత్రం తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే తర్వాత వచ్చిన విరాట్ కోహ్లితో కలిసి ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కోహ్లి సమన్వయంతో బ్యాటింగ్ చేయగా ధావన్ ధాటిగా ఆడాడు. ఈ జోడీని విడగొట్టేందుకు సౌతాఫ్రికా బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడక తప్పలేదు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కోహ్లి, ధావన్‌లు జట్టును పటిష్టస్థితికి చేర్చారు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 84 బంతుల్లో పది ఫోర్లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించిన కోహ్లి 3 ఫోర్లతో 51 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. రిషబ్ పంత్ (16), శ్రేయస్ (17), వెంకటేశ్ అయ్యర్ (2), అశ్విన్ (7) ఘోరంగా విఫలమయ్యారు. భువనేశ్వర్ (7) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. ఇక చివర్లో ఒంటరి పోరాటం చేసిన శార్దూల్ ఠాకూర్ 43 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి బుమ్రా 14 (నాటౌట్) అండగా నిలిచాడు.
సెంచరీలతో చెలరేగారు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను కెప్టెన్ తెంబా బవుమా, వండర్ డుసెన్ సెంచరీలతో ఆదుకున్నారు. ఒక దశలో 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను వీరిద్దరూ గట్టెక్కించారు. కెప్టెన్సీ ఇన్నిగ్స్ ఆడిన బవుమా 143 బంతుల్లో 8 ఫోర్లతో 110 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా ఆడిన వండర్ డుసెన్ 96 బంతుల్లోనే 4 సిక్సర్లు, 9 బౌండరీలతో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 204 పరుగులు జోడించారు.