Friday, December 20, 2024

తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి..

- Advertisement -
- Advertisement -

Telangana Report 4207 fresh corona cases

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీలో 12,615 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 4,207 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,20,215 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,207 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,22,403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,645 కేసులు నమోదయ్యాయి.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 380, రంగారెడ్డి జిల్లాలో 336 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,067కు చేరింది. తాజాగా కరోనా నుంచి 1,825 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,91,703 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.75 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 10,136 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
ఏపీలో ఆందోళనకరంగా కొవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సంక్రాంతి వేడుకలు, ప్రయాణికుల రద్దీ, గుంపులుగా సంచరించడం వంటి కారణాలతో కొవిడ్ కేసులు పెరిగినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 47,420 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,615 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో ఐదుగురు మృతి చెందారు. 3,674 మంది మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 53,871 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పాజిటివ్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు. హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
కొవిడ్ బారినపడ్డ మరో ఎంఎల్‌ఎ
జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఇద్దరు ఎంఎల్‌ఎలు గండ్ర వెంకటరమణా రెడ్డి, శంకర్ నాయక్‌లకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వరుసగా అందరూ కరోనా బారిన పడుతుండటంతో.. నేతల్లో ఆందోళన మొదలైంది.

Telangana Report 4207 fresh corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News