మనతెలంగాణ/హైదరాబాద్: ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మేడారం మహాజాతర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19వరకు ఈ జాతరను నిర్వహించనున్నారు. సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కాగా ఇది విగ్రహాలు లేని జాతర. సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కుంభమేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలాది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఓ వైపు జాతరలో అభివృద్ధి పనులు కొనసాగుతుండగా మరోవైపు అధికారుల్లో ఒమైక్రాన్ గుబులు పుట్టిస్తోంది. ఈ జాతరకు వచ్చే వారు రెండో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా 24 గంటల్లోపు కరోనా నెగెటివ్ రిపోర్టు చూపిం చేలా అంక్షలు విధించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మహాజాతర వైద్య, ఆరోగ్య శాఖకు సవాల్‌గా మారడంతో రాష్ట్ర ఉన్నతాధి కారులు స్వయంగా రంగంలోకి దిగినట్టుగా తెలిసింది.
Medaram Jatara from Feb 16 to 19